తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ కేసులో జగన్ రెడ్డి, వైసీపీ హిందువుల ముందు దోషిగా నిలబడ్డారు. ఈ వివాదంలో ఇరుక్కుపోయిన ఆయన విచక్షణ కోల్పోయినట్లు కనిపిస్తోంది. తమపై వచ్చిన ఆరోపణల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి, చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థను లక్ష్యంగా చేసుకుని అవాస్తవ ప్రచారాలకు తెరలేపడం వారి నైతిక పతనానికి నిదర్శనం. బోడిగుండుకు మోకాలికి కూడా ముడిపెట్టలేని క్కడో సంబంధం లేని విషయాలను తీసుకువచ్చి ఫేక్ పత్రాలతో విషప్రచారం చేస్తున్నారు.
హెరిటేజ్ లక్ష్యంగా కుట్రలు
హెరిటేజ్ సంస్థ కంటే పెద్దదైన ఇందాపూర్ డెయిరీని దాని సబ్సిడరీగా చిత్రీకరించడం, పదేళ్ల క్రితం నాటి పాత అంశాలను ఇప్పుడు నెయ్యి కల్తీ వివాదానికి ముడిపెట్టడం కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే. దశాబ్దాలుగా పాడి పరిశ్రమలో విశ్వసనీయతను సంపాదించుకున్న ఒక సంస్థపై, ఎటువంటి ఆధారాలు లేకుండా పాలు పాలు కావు.. పెరుగు పెరుగు కాదు అంటూ చేసే వ్యాఖ్యలు కేవలం ఒక రాజకీయ మీడియా దిగజారుడుతనానికి అద్దం పడుతున్నాయి. ఏ తప్పూ లేకపోయినా, కేవలం కసితో ఒక బ్రాండ్‌ను దెబ్బతీయాలని చూడటం వ్యాపార నైతికతకే విరుద్ధం.
మీడియా ముసుగులో విధ్వంసం
ప్రజాస్వామ్యంలో మీడియా బాధ్యత నిజాన్ని నిర్భయంగా చెప్పడం. కానీ సాక్షి వంటి సంస్థలు కేవలం తమ రాజకీయ యజమానుల ప్రయోజనాల కోసం అబద్ధాలను వండటం, లేని వాటిని ఉన్నట్లుగా సృష్టించడం సమాజానికి పెను ముప్పుగా పరిణమించింది. ఒక పారిశ్రామిక వేత్తగా, రాజకీయ నేతగా చంద్రబాబు గీసుకున్న లక్ష్మణ రేఖను చెరిపేసేందుకు, బురదజల్లి ఆనందం పొందే ఈ సైకో మనస్తత్వం రాజకీయాల్లో ఉండటం ప్రమాదకరం. ఆధారాలు లేని కథనాలతో ప్రజల్లో గందరగోళం సృష్టించడం వల్ల స్వల్పకాలిక రాజకీయ లాభం కలగవచ్చు కానీ, వ్యవస్థాగతంగా అది మీడియాపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది. హెరిటేజ్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ చట్టాలను ఎప్పుడూ గౌరవించే సంస్కృతి జగన్ రెడ్డి గ్యాంగ్ కు లేదు.
నిలకడ లేని రాజకీయం – నిలబడేది నిజం మాత్రమే
రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ విమర్శలు చేసేటప్పుడు కనీస గౌరవం, సత్యం ఉండాలి. తిరుమల పవిత్రతను కాపాడటంలో విఫలమైన వారు, ఆ తప్పును సరిదిద్దుకోకుండా ఎదురుదాడికి దిగడం వారి అపరాధ భావనను బయటపెడుతోంది. ఎన్ని కృత్రిమ కథనాలు అల్లినా, దశాబ్దాల పాటు ప్రజల నమ్మకంపై నిర్మితమైన హెరిటేజ్ వంటి సంస్థల ప్రతిష్టను ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఏమీ చేయలేవు. కానీ ఈ క్రమంలో వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న వారి వైఖరి మాత్రం సమాజానికి తీరని హాని కలిగిస్తోంది.
