నారా లోకేష్ మరోసారి విశాఖ కోర్టుకు హాజరయ్యేందుకు బుధవారం వెళ్తున్నారు. ఆయన ఇలాకోర్టుకు హాజరవడం.. ఇది నాలుగోసారో.. ఐదో సారో. అధికారంలోకి రాక ముందు వెళ్లారు. అధికారంలోకి వచ్చాక కూడా వాయిదా ఉన్నప్పుడల్లా వెళ్తున్నారు. ఇంత ఓపికగా ఆయన కోర్టుకు వెళ్లడానికి కారణం.. సాక్షి తప్పు చేసిందని నిరూపించడం. జగన్ రెడ్డి అవినీతి పుత్రిక నిర్వాకాన్ని ప్రజల ముందు ఉంచడమే.
లోకేష్‌పై లెక్కలేనన్ని తప్పుడు ప్రచారాలు
2019 అక్టోబర్‌లో సాక్షి పత్రికలో ” చిన్నబాబు .. రూ. 25 లక్షల చిరుతిళ్లు” అనే శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది. విశాఖ విమానాశ్రయంలో లోకేష్ అల్పాహారం కోసమే ప్రభుత్వం రూ. 25 లక్షలు ఖర్చు చేసిందని ఆ కథనం సారాంశం. అయితే, ఇది పచ్చి అబద్ధమని, తన ప్రతిష్టను దిగజార్చడానికి చేసిన కుట్ర అని లోకేష్ మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేస్తూ, విశాఖ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. సాక్షి సమాచారంతో ఇలాంటి కథనాలు ప్రచురించిన సంస్థలు లోకేష్‌కు క్షమాపణలు చెప్పి బయటపడ్డాయి. కానీ సాక్షి మాత్రం మాకు మామూలే అని లైట్ తీసుకుంది. కానీ లోకేష్ వదిలి పెట్టాలనుకోలేదు.
లోకేష్ న్యాయపోరాటం – ఓర్పుతో కూడిన వ్యూహం
సాధారణంగా రాజకీయ నాయకులు ఇటువంటి వార్తలను ఖండించి వదిలేస్తుంటారు. కానీ లోకేష్ ఈ విషయంలో చట్టపరమైన తుది పోరాటం అనే వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఏళ్ల తరబడి విచారణ జరుగుతున్నా, ఆయన స్వయంగా కోర్టుకు హాజరవుతూ సాక్ష్యాలను బలోపేతం చేస్తున్నారు. సాక్షి పత్రిక ప్రతినిధులు కోర్టుకు రాకుండా స్టే తెచ్చుకోవాలని చూసినా సఫలీకృతం కాలేకపోయారు. ఈ కేసు ద్వారా లోకేష్ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే చందంగా వ్యవహరిస్తున్నారు. సాక్షి పత్రిక అసత్య ప్రచారాలు చేస్తుందని కోర్టు ద్వారానే నిరూపిస్తే, భవిష్యత్తులో ఆ పత్రిక చేసే ఏ విమర్శకైనా విలువ ఉండదు. వ్యక్తిగత అవినీతి ఆరోపణలను ఎదుర్కోవడంలో తాను వెనకడుగు వేయబోనని, తన వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేస్తే చట్టపరమైన పరిణామాలు ఎలా ఉంటాయో ప్రత్యర్థులకు చూపిస్తున్నారు.
సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పాల్సిందే !
విశాఖ కోర్టుకు లోకేష్ పదేపదే రావడం ద్వారా ఉత్తరాంధ్రలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంతో పాటు, ప్రత్యర్థి పార్టీ వైఫల్యాలను ఎండగట్టే వేదికగా కూడా దీన్ని వాడుకుంటున్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకంతో ఆయన చేస్తున్న ఈ పోరాటం, చివరికి సాక్షి పత్రికను ఆత్మరక్షణలో పడేసింది. ఈ కేసులో సాక్షి ఒకవేళ క్షమాపణ చెప్పాల్సి వస్తే, అది లోకేష్‌కు పెద్ద నైతిక విజయంగా మారడమే కాకుండా, రాబోయే రోజుల్లో సోషల్ మీడియా , మీడియాలో జరిగే అసత్య ప్రచారాలకు ఒక గట్టి హెచ్చరికలా మారుతుంది. కాస్త ఆలస్యమైనా న్యాయప్రక్రియ ద్వారా సాక్షి చివరికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. లేకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుంది.
