హైదరాబాద్: టాడా(తీవ్రవాద, విధ్వంసక కార్యకలాపాల నిరోధక చట్టం) కోర్టు చేసిన ఒక పొరపాటువల్ల 1993 ముంబాయి పేలుళ్ళకేసులో శిక్ష అనుభవిస్తున్న నటుడు సంజయ్‌దత్‌కు ఊరట లభించనుంది. ఈ కేసులో సంజయ్‌దత్ చేసినట్లు నిరూపితమైన నేరం – నిషేధించబడిన ఏకే-56 రైఫిల్‌ను చట్టవిరుద్ధంగా కలిగి ఉండటం. అయితే ఏకే-56 అసలు నిషేధిత ఆయుధాల క్యాటగిరిలో లేదని తాజాగా బయటపడింది.
ఇదే కేసులో సంజయ్‌దత్‌తోబాటు శిక్ష విధించబడిన యూసఫ్ మొహిసిన్ నల్‌వాలా ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. ఏకే-56 సెమీ ఆటోమేటిక్ రైఫిల్ అని, నిషేధించబడిన ఆయుధాలకు సంబంధించిన చట్టంలోని సెక్షన్ 2(1)(I)లో నిర్వచనంప్రకారం అది నిషేధిత ఆయుధం కాదంటూ నల్‌వాలా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ కూడా ఆ ఆయుధాన్ని ఆటోమేటిక్ అనిగానీ, నిషేధిత ఆయుధం అనిగానీ నిరూపించలేకపోయిందనే విషయాన్ని గుర్తించాలని పిటిషన్‌లో కోరారు. తనకు విధించిన శిక్షను రద్దు చేయాలని అభ్యర్థించారు. దీనిపై కోర్ట్ స్పందిస్తూ, ఈ విషయాన్ని టాడా కోర్టు చూడకుండా ఎలా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కోర్టులు ఇచ్చిన తీర్పులన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉంటాయని చెప్పలేమని దీనివలన నిరూపితమవుతోందని పేర్కొంది. ఒక క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయాలని నల్‌వాలా తరపు న్యాయవాదికి సూచించింది.
నల్‌వాలా క్యూరేటివ్ పిటిషన్‌లోని వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవిస్తే, ఈ నేరానికి మూడేళ్ళ శిక్షే అనుభవించాలి కాబట్టి అతనికి, అతనితోబాటు సంజయ్‌దత్‌కూ శిక్ష తగ్గుతుంది. ఇప్పటికే వీరు మూడేళ్ళశిక్ష అనుభవించేశారు కాబట్టి ఇక బయటకొచ్చేస్తారు.