తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకొన్నా అది సంచలనం సృష్టిస్తుంది. రాష్ట్రంలో గుడుంబాని అరికట్టేందుకే చీప్ లిక్కర్ ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. కానీ అందరూ చీప్ లిక్కర్ త్రాగే చీప్ మనుషులు ఉండరు కనుక అటువంటి వారికోసం గల్లీ గల్లీలో బీర్ మిషన్లను (మైక్రో బ్రూవరీ మెషిన్లు) అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతికి ముందు రోజు అంటే అక్టోబర్ 1నుండి తెలంగాణా రాష్ట్ర ప్రజలకు ఈ బీర్ మిషన్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.
ఈ మిషన్లను ఏర్పాటు చేసుకోవడానికి మద్యం షాపులకు ఉండే నియమ నిబంధనలే అమలుచేస్తారు. ఈ మిషన్లు పెట్టుకోదలచినవారు లైసెన్స్ ఫీజు రూ. 3లక్షలు, సెక్యూరిటీ డిపాజిట్ గా మరో లక్ష రూపాయలు కలిపి మొత్తం నాలుగు లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. నివాస ప్రాంతాలలో ఉండే కమర్షియల్ కాంప్లెక్స్ లలో కూడా వీటిని అమర్చుకొని ప్రజలకు బీర్ తాపించవచ్చును. కానీ రోజుకి వెయ్యి లీటర్ల కంటే ఎక్కువ తాపించకూడదనే ఇబ్బందికరమయిన షరతు ఒకటి విధించింది. డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లయితే బహుశః మున్ముందు దానిని క్రమంగా పెంచుకొనే సౌలభ్యం ఎలాగూ ఉంటుంది కనుక బీర్బల్స్ దాని గురించి వర్రీ అవకుండా వీధి చివర షాపులో పెట్టబోయే బీర్ మిషన్లలో రకరకాల రుచులలో లభించబోయే బీర్ సేవించవచ్చును.
అయితే ఇదంతా ఆదాయం కోసమే చేస్తున్న ఆలోచనలని ప్రతిపక్షాలు ఆరోపించడం హాస్యాస్పదం. ఎందుకంటే తెలంగాణా రాష్ట్రం దేశంలో రెండవ ధనిక రాష్ట్రం. ఆదాయం కోసం ఇటువంటి కక్కుర్తి పనులు చేయవలసిన అవసరం లేదు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు డల్లాస్, సింగపూర్ వంటి ప్రపంచ స్థాయి నగరాలుగా ఎదగడానికి ఇటువంటివన్నీ చాలా అవసరం. అందుకే ప్రభుత్వం ప్రజలకు ఇటువంటి గొప్ప గొప్ప సౌకర్యాలన్నీ కల్పిస్తుంటే ప్రతిపక్షాలు అనవసరంగా ఆందోళన చేస్తున్నాయి.
ఒకప్పుడు ప్రజలకి దాహం వేసినప్పుడు వీధిలో ఉన్న పాన్ షాపులో గోలీ సోడాలు త్రాగేవారు. కూల్ డ్రింక్స్ వచ్చిన తరువాత జనాలు వాటికి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు మహేష్ బాబు చెపితే తప్ప సోడాలు త్రాగడం మానేశారు. అది కూడా ఏ మెక్ డోవెల్ కంపెనీ వాళ్ళో తయారు చేసిన సోడాలను మాత్రమే త్రాగుతున్నారు. మళ్ళీ ఇప్పుడు చల్లటి బీర్ అందుబాటులోకి వచ్చేస్తోంది కనుక ఇంకజనాలు దానికి షిఫ్ట్ అయిపోయి గాలిలో తేలిపోతూ రోడ్లమీద తూలుకొంటూ హాయిగా అభివృద్ధి పధంలో ముందుకు సాగిపోవచ్చును.