హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి 4 నుంచి 5 వేల ఎకరాల భూమి సరిపోతుందని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే 32 వేల ఎకరాల భూమిని సేకరించినందున ఇంకా రైతులను వేధించటం మంచిదికాదని ప్రభుత్వానికి సూచించారు. అంతా ఒకేచోట కేంద్రీకరించి హైదరాబాద్‌లో చేసిన తప్పునే మళ్ళీ చేయకూడదని కోరారు. అవసరంమేరకు భూమిని సేకరిస్తే బాగుంటుందిగానీ, అదే పనిగా వేలకు వేల ఎకరాలను రైతులనుంచి బలవంతంగా లాక్కోవటం మానుకోవాలని సూచించారు. చిన్నరైతులను కొల్లగొట్టి సంవన్న అనుచర బృందానికి భూములను కట్టబెట్టటం ప్రభుత్వం చేయాల్సినపని కాదని హితవు పలికారు. రియల్ ఎస్టేట్ బుద్ధిని ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం మార్చుకోవాలన్నారు. పరిశ్రమలకు పన్ను రాయితీల విషయంలోకూడా ఏపీ ప్రభుత్వం సీఆర్‌డీఏ వరకు మాత్రమే అడుగుతోందని, మిగిలిన వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతం, రాయలసీమ, ఉత్తర కోస్తా ఏమైపోవాలని జేపీ ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాలను పరిరక్షించి, రాష్ట్రం అభివృద్ధి చెందేలా లోక్‌సత్తా పార్టీ – జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి పోరాటం చేస్తుందని జయప్రకాష్ నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.