గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు కేవలం వినోదం మాత్రమే కాదు, అవి మన సంస్కృతికి నిలువుటద్దం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వేడుకల అసలు ఉద్దేశం పక్కదారి పట్టి, కేవలం కోడిపందేలు, జూదాలే ప్రధానంగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గోదావరి జిల్లాలు సంక్రాంతి సంబరాలకు కేరాఫ్ అడ్రస్. పచ్చని పొలాలు, కొబ్బరి తోటల మధ్య ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలతో పల్లె సీమలు కళకళలాడుతుంటాయి. కానీ, గత కొన్నేళ్లుగా సంక్రాంతి అంటే కోడిపందేలే అనే ముద్ర బలంగా పడిపోతోంది.
కోడిపందేల కోసం గోదావరి జిల్లాలకు పరుగులు
సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో గోదావరి జిల్లాలలో కోడిపందేలు, గుండాల వంటి జూదాల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారడం కామన్‌గా జరిగిపోతోంది. జూదం ఒక వ్యసనంగా మారడం వల్ల పండుగ అసలు పరమార్థం మరుగున పడిపోతోంది. కత్తులు కట్టి ఆడటం నేరం అయినా ఆపే పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం అయినా తల వంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. మూడు రోజుల పాటు వదిలేస్తున్నారు. తర్వాత కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మూడు రోజుల పాటు పందెం రాయుళ్లు కుటుంబాలను వదిలేసి పందేలతోనే పండగ చేసుకుని సర్వం కోల్పోతున్నారు.
పండగంటే పందేలు కాదు !
సంస్కృతి – సంప్రదాయాల కలయికే అసలైన పండుగ. సంక్రాంతి అంటే రైతన్నలు తాము పండించిన పంట లక్ష్మిని ఇంటికి తెచ్చుకునే పండుగ. ముత్తయిదువల రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, గాలిపటాల సందడి, పిండివంటల ఘుమఘుమలు.. ఇవే మన వారసత్వ సంపద. కోడిపందేలను కేవలం పందెం రాయుళ్ల ‘బెట్టింగ్’ అడ్డాగా కాకుండా, గ్రామీణ క్రీడగా మాత్రమే చూడాలి. జూదాన్ని విడనాడి, మన కళలను, కట్టుబాట్లను భావి తరాలకు అందించే వేదికగా సంక్రాంతిని తీర్చిదిద్దాలి. కానీ జరుగుతోంది వేరు. ప్రభుత్వం , స్థానిక సంస్థలు సంప్రదాయ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజల దృష్టిని పందేల నుంచి మరల్చవచ్చు. ఇటీవల అలాంటి ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
పందేల సంస్కృతి మార్చేందుకు అడుగులు
ఇటీవల పిఠాపురం వంటి ప్రాంతాల్లో జరిగిన సంక్రాంతి మహోత్సవాలు బాగా జరిగాయి. పడవ పందేలు, ఎడ్ల బళ్ల పోటీలు, రంగవల్లికల పోటీలు , సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రాధాన్యతనిస్తే, పండుగ ఒక సామాజిక ఉత్సవంలా మారుతుంది. పర్యాటకులకు గోదావరి ఆతిథ్యాన్ని, ఇక్కడి రుచులను పరిచయం చేసే ఫుడ్ ఫెస్టివల్స్ లాంటివి మరిన్ని నిర్వహించాలి. మార్పు ప్రజల నుంచే రావాలి. చట్టాలు, పోలీసు ఆంక్షలు ఎన్ని ఉన్నా, ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే ఈ జూద సంస్కృతి అంతమవుతుంది. పండుగ అంటే కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా గడపడం, బంధుమిత్రులతో ఆత్మీయతలను పంచుకోవడం. లక్షల రూపాయలు పందేల్లో పోగొట్టుకుని ఆర్థికంగా చితికిపోవడం పౌరుషం కాదు, పండుగ స్ఫూర్తి అంతకన్నా కాదు.
