కొత్త గూడెం కార్పొరేషన్ లో బీఆర్ఎస్ మద్దతు తీసుకోకపోవడానికి సీపీఐకి ఏం కారణాలు ఉన్నాయో.. ఎలాంటి ఒత్తిళ్లు పని చేసాయో తనకు తెలియదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీపీఐకి ఆయన మద్దతు ప్రకటించినా.. ఆయన మద్దతు అవసరం లేదని సీపీఐ అనుకుంది. కాంగ్రెస్ తో కలిసి మేయర్ పదవిని, డిప్యూటీ మేయర్ పదవుల్ని పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఇది కేటీఆర్కు ఇబ్బందికరంగా మారింది. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో ఉన్నాయి. జాతీయస్థాయిలో ఒకే కూటమిలో ఉన్నాయి. కానీ స్థానిక ఎన్నికల్లో మాత్రం కలసి పోటీ చేయలేదు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో తొందరపడి సీపీఐకి షరతుల్లేకుండా మద్దతు ప్రకటించిన కేటీఆర్కు తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి అవసరమైన కారణాలు దొరకడం లేదు. సీపీఐ .. కేటీఆర్ ఆఫర్ ఇచ్చిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది. కానీ ఆయన మద్దతు తీసుకుంటామని చెప్పలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి కార్పొరేషన్ ను కైవసం చేసుకుంటామని ప్రకటించింది. దీంతో కేటీఆర్ ఆఫర్ తేలిపోయింది. అడగకపోయినా మద్దతు ప్రకటించి.. చివరికి ఆయన మద్దతు కూడా అవసరం లేదనిపించుకున్నారు.
ఇప్పుడు అందరూ ఆయనకు రాజకీయ తెలివి తేటలు లేవని.. అంతా తొందరపాటు తప్ప కనీస ఆలోచన లేదని సెటైర్లు వేస్తూ.. కేటీఆర్ సింగరేణి కోసమే సీపీఐకి మద్దతు ప్రకటించానని చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ సింగరేణిలో దోపిడీకి పాల్పడుతున్నాయని అందుకే సీపీఐకి మద్దతు ప్రకటించానన్నారు. కొత్తగూడెంలో సింగరేణి ఉద్యోగులు ఎక్కువగా ఉండవచ్చు కానీ.. మేయర్ సీటుకు.. సింగరేణి దోపిడీకి వ్యతిరేకంగా సీపీఐకి మద్దతివ్వడానికి కారణమేంటో కేటీఆర్కే తెలియాలన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
