తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపును పొందుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతమైన గోదావరి జిల్లాల వైభవం దేశవ్యాప్త పర్యాటకులను ఆకర్షిస్తోంది. పచ్చని పొలాలు, కాలువ గట్లు, సాంప్రదాయ పిండివంటల ఘుమఘుమలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, ఈ ఏడాది ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం పెద్ద ఎత్తున ఈ ప్రాంతాలకు తరలివస్తున్నారు. పర్యాటకుల రద్దీ పెరగడంతో భీమవరం, అమలాపురం వంటి పట్టణాల్లో హోటల్ గదుల అద్దెలు సైతం ఆకాశాన్నంటాయి. దీనికి కారణం సోషల్ మీడియాలోనే. సోషల్ మీడియాలో గోదావరి జిల్లాల సంక్రాంతి సంబరాల గురించి విపరీతంగా జరుగుతున్న ప్రచారంతో నార్త్ నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తున్నారు.
ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన ప్రభుత్వం
సంక్రాంతికి గోదావరి జిల్లాలకు పెరుగుతున్న పర్యాటకుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురంలో తొలిసారిగా కేరళ తరహాలో డ్రాగన్ బోట్ రేసెస్ నిర్వహించింది. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 250 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనడంతో ఆత్రేయపురం గోదావరి గట్టు పండుగ శోభతో కళకళలాడుతోంది. ప్రసిద్ధ పూతరేకుల రుచికి తోడుగా ఈ సాహస క్రీడలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి.
కాకినాడలో సర్వాంగసుందరంగా బీచ్
మరోవైపు, కాకినాడ జిల్లాలోని ఎస్.యానాం బీచ్‌ను ప్రభుత్వం సుమారు రూ. 8 కోట్ల నిధులతో తీర్చిదిద్దింది. ఇక్కడ జనవరి 14 నుంచి మూడు రోజుల పాటు భారీ ఎత్తున సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. పర్యాటకుల కోసం ఆధునిక ఆడిటోరియం, రెస్టారెంట్లు, రాత్రి వేళ సోలార్ విద్యుత్ దీపాల వెలుగులతో బీచ్ ప్రాంతాన్ని సుందరీకరించారు. బీచ్ కబడ్డీ, సాంస్కృతిక ప్రదర్శనలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. అలాగే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు పేరుతో ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించి పండుగ సందడిని ప్రభుత్వం ముందే తీసుకువచ్చింది.
కారవాన్ టూరిజానికి మరింత డిమాండ్
పర్యాటక శాఖ ఈ ఏడాది మరింత అడుగు ముందుకు వేసి కారవాన్ టూరిజం ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల నుండి భీమవరం, దిండి , పిఠాపురం వంటి ప్రాంతాలకు ప్రత్యేక కారవాన్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. పల్లెటూరి వాతావరణం, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు , కోడిపందేల సందడిని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారి కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ప్యాకేజీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వ సహకారం , సోషల్ మీడియా ప్రచారం తోడై ఈ సంక్రాంతి ఏపీ తీర ప్రాంతానికి కొత్త ఆదాయ మార్గాలను, పర్యాటక వైభవాన్ని తెచ్చిపెట్టింది. రాబోయే రోజుల్లోనూ ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది.
