రామ్ గోపాల్ వర్మ ట్రెండ్ సెట్టర్. ‘శివ’తో మొత్తం తెలుగు సినిమానే ఒక మలుపు తిప్పాడు. ఆ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఓ కొత్త శకం మొదలైయింది. ఇక బాలీవుడ్లో కూడా జెండా పాతాడు వర్మ. సత్య ,రంగీలా చిత్రాలతో బాలీవుడ్ లో వర్మ పేరు మార్మ్రోగిపోయింది. దర్శకుడిగానే కాకుండా తన తెలివితేటలతో ఏకంగా ఒక సినిమా ఫ్యాక్టరీ స్టార్ట్ చేశాడు వర్మ. ఈ ఫ్యాక్టరీ నుండి అనేక మంది దర్శకులు, టెక్నిషియన్లు ఇండస్ట్రీ పరిచయం అయ్యారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు వర్మ మార్క్ మిస్ అయ్యింది. గత కొన్నాళ్లుగా ఆయన నుండి వస్తున్న సినిమాలు నిరాస పరుస్తున్నాయి. అయినా వర్మపై ఆయన అభిమానుల్లో నమ్మకం పోలేదు. ఏ క్షణంలోనైనా వర్మ నుండి ఒక మెరుపు వస్తుందని ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్ ఇపుడా మెరుపు సర్కార్ 3తో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సర్కార్.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో వర్మ రూపుందించిన ఓ బ్రాండ్. గాడ్ ఫాదర్ స్ఫూర్తితో ‘బాల్ థాకరే’క్యారెక్టర్ డిజైన్ తో వర్మ రూపుందించిన ఈ సిరీస్ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సీరిస్ లో వచ్చిన రెండు చిత్రాలు మంచి ఫలితాన్ని అందుకున్నాయి. ఇప్పుడీ సినిమా పార్ట్3సిద్దం చేశాడు వర్మ. తాజగా ఈ చిత్రం ట్రైలర్ బయటికివచ్చింది. ట్రైలర్ చూస్తే మునపటి వర్మ కనిపించాడు. గత కొద్దిరోజులుగా సినిమాని మరీ లైట్ మేనర్ లో తీసి పారేస్తున్నాడు వర్మ. అయితే సర్కార్ విషయానికి వస్తే వర్మ ఇంటెన్సిటీ కనిపించింది. మేకింగ్ లో వర్మ మెరుపులు కనిపించాయి. అమితాబ్ బచ్చన్ గురించి చెప్పకర్లేదు. ఎప్పటిలాగే ఆయన సర్కార్ గా ఒదిగిపోయారు. ఇదివరకు వచ్చిన రెండు సినిమాల కంటే ఇంకా ఇందులో ఇంకాస్త స్ట్రాంగ్ గా కనిపించారు. యామీ గౌతమ్, జాకీ ష్రాఫ్, మనోజ్ బాజ్ పే,రోహిణి.. ఇలా భారీ తారాగణం వుంది ఇందులో. మొత్తంమ్మీద ట్రైలర్ సర్కార్ పై అంచనాలను పెంచింది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కొత్త నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. ఆయన మార్క్ లో ఒక సినిమా తీస్తే చాలు. ఆ మార్క్ సర్కార్ 3లో కనిపిస్తే చాలు.