తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వి.కె. శశికళ తన కొత్త రాజకీయ పార్టీ పేరును, గుర్తును అధికారికంగా ప్రకటించారు. ఈ పార్టీకి ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం అని పేరు పెట్టారు. చెన్నైలోని తన నివాసంలో మద్దతుదారుల మధ్య ఈ ప్రకటన చేసిన ఆమె, పార్టీ గుర్తుగా కొబ్బరి తోట ను ఎంచుకున్నట్లు వెల్లడించారు.
జయలలిత సఎంజీఆర్ ఆశయాల సాధనే లక్ష్యంగా ఈ పార్టీ పనిచేస్తుందని శశికళ స్పష్టం చేశారు. ఒకే ఒక్క చెట్టుతో తోట సాధ్యం కాదని, కార్యకర్తలు, ప్రజలందరూ కలిసి ఒకే కుటుంబంలా ఉంటేనే అది తోట అవుతుందని, అందుకే కొబ్బరి తోట గుర్తును ఎంచుకున్నట్లు ఆమె వివరించారు. ఈ పార్టీ జెండాపై అన్నాదురై, ఎంజీఆర్, , జయలలిత చిత్రాలను పొందుపరిచారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో కూడా తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించుతామని ఆమె ప్రకటించారు. గత తొమ్మిదేళ్లుగా మౌనంగా ఉన్నానని, ఇకపై మౌనంగా ఉంటే అది ప్రజలకు చేసే ద్రోహమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. శశికళ కొత్త పార్టీ ప్రకటనతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి, ముఖ్యంగా ఏఐఏడీఎంకే ఓటు బ్యాంకుపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.


