పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని, రాష్ట్రపతి నుంచి దేశంలోని ముఖ్యులైన ఆయన భక్తులు ఎంతో మంది వస్తున్నారు. విదేశీ భక్తులూ వస్తున్నారు. ఆయనపై భక్తి ఉన్న వారంతా వచ్చి ప్రశాంతి నిలయంలో ఆయనగతంలో దర్శనం ఇచ్చే చోట కనిపిస్తున్న ప్రతిమమూర్తిని దర్శనం చేసుకుని ధ్యానం చేసుకుంటున్నారు. ఆయన చేసిన సేవల్ని స్మరించుకుంటున్నారు.
సేవల్లో ఆయన దేవుడే
సత్యసాయి సేవలు సామాన్యమైని కావు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులను కూడా చేసారు. అనంతపురం జిల్లాలో దాదాపు 750 గ్రామాలకు తాగునీరు అందించిన “శ్రీ సత్యసాయి తాగునీరు పథకం” ఓ రికార్డ్. అప్పట్లోనే రూ. 300 కోట్లకుపైగా ఖర్చు పెట్టారు. పుట్టపర్తి, బెంగళూరు వైట్‌ఫీల్డ్ లోని శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు గుండె, మెదడు, కిడ్నీ, కంటి శస్త్రచికిత్సలు ఒక్క రూపాయి లేకుండా చేస్తున్నాయి. గత 15 ఏళ్లలో ఈ రెండు ఆస్పత్రుల్లోనే 35 లక్షల మందికి పైగా ఉచిత వైద్య సేవలు అందాయి. శ్రీ సత్యసాయి విద్యా విహార్ వ్యవస్థ కింద భారతదేశంలో 100కి పైగా పాఠశాలలు, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రశాంతి నిలయంలో ఉన్న శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.
సత్యసాయి వల్లే పుట్టపర్తికి ప్రత్యేక గుర్తింపు
పుట్టపర్తిలో 1990లోనే ఎయిర్ పోర్టు ఉంది. అక్కడకు కమర్షియల్ విమానాలు రావు. కానీ సత్యసాయి దర్శనం కోసం వచ్చే విమానాలతో సందడిగా ఉంటుంది. పుట్టపర్తిని మోడరన్ టౌన్‌గా మారిందంటే దానికి కారణం సత్యసాయినే. ప్లానెటేరియం, మ్యూజియం, రైల్వే స్టేషన్, స్టేడియం ఉన్నాయి. సత్యసాయి ఎప్పుడూ విదేశాలకు వెళ్లలేదు. ఒక్క సారి మాత్రమే ఆఫ్రికా వెళ్లారు. అయితే బెంగళూరు వైట్ ఫీల్డ్ ఆశ్రమంలో ఉండేవారు లేకపోతే పుట్టపర్తిలో ఉండేవారు. అయినా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు.
కానీ సేవలకు నిధులన్నీ ఎవరిచ్చేవారు ?
సత్యసాయి ఇప్పుడు జీవించి లేరు.ఆయన పుట్టింది నిరుపేద కుటుంబంలోనే. చిన్న వయసులోనే సత్యసాయిగా మారిన తర్వాత సేవా కార్యక్రమాలు.. సేవా సామ్రాజ్యం విస్తరించింది. వందలు, వేల కోట్లతో సేవలు చేశారు. మరి ఆ నిధులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయన్నది సామాన్యులకు సైతం అర్థం కాని ప్రశ్న. ప్రజల్ని దోచుకునే రాజకీయ నేతలు ఆయన వద్ద దాచి పెడతారని చెప్పుకునేవారు. ఏదీ నిజం కాలేదు. అలాగే ఆయనకు ఎవరెవరు విరాళాలు ఇస్తే ఇన్ని భారీ కార్యక్రమాలు చేపట్టగలిగారో కూడా ఎవరికీ తెలియదు. ఏదైనా.. సక్రమమో.. సక్రమమో.. అలా సంపాదించిన సొమ్ము మళ్లీ బాబా ద్వారా పేద ప్రజల సేవలకే ఉపయోగపడిందని సంతృప్తి మాత్రం చాలా మందికి ఉంటుంది.