సెటైర్ : బల్మాన్ థాన్ నిర్దోషి

అది ముంబాష్మతి రాజ్యం. ఆ రాజ్యానికి రాజు గుణసేనుడు. ఆయన రాజ్యంలో అవినీతి, అక్రమాలకు తావులేదు. ధర్మం నాలుగుపాదాల నడుస్తుంటుందని జనం అనుకునేవారు. గుణసేనుడు యవ్వనంలో ఉన్నప్పుడు పొరుగు రాజ్యమైన థాన్లీస్తాన్ రాజకుమారిని వివాహమాడాడు. ఆ తర్వాత గుణసేనుడు చాలా తెలివిగా థాన్లీస్తాన్ ప్రాంతాన్ని తన రాజ్యంలో కలిపేసుకున్నాడు. అప్పటి నుంచి రాజుగారి బావమరిది బల్మన్ థాన్ అక్కాబావల దగ్గరే ఉంటున్నాడు. బల్మాన్ పుట్టీపుట్టగానే మంచి కండలతో పుట్టాడు. మహా బలవంతుడవుతాడని బల్మాన్ అని పేరుపెట్టారు. అన్నట్టుగానే బల్మాన్ థాన్ కండలవీరునిగా పేరుతెచ్చుకున్నాడు. ఎలాగో, రాజ్యమూ, రాజ్యాధికారం లేవుకనుక బలాదూరుగా తిరిగేవాడు. నటుడిగా పేరుతెచ్చుకున్నాడు. పగలంతా అంతఃపురంలో పడుకుని రాత్రికాగానే తన రథాన్ని బయటకుతీసి నగరమంతా స్వేచ్ఛగా తిరుగుతుంటాడు. ఇందుకోసం పశ్చిమ దేశాలన్నీ గాలించి ఉన్నతాశ్వాలను తెప్పించాడు. యథేచ్ఛగా తిరిగే బల్మాన్ థాన్ పై అభియోగం మోపబడింది. ఈ వార్త ఆ రాజ్యంలోనే సంచలనం సృష్టించింది.

ముంబాష్మతి రాజ్య న్యాయసభ గంభీరంగా ఉంది. ప్రధాన ధర్మమూర్తి సాక్షాసాక్షాలను నిశితంగా గమనిస్తున్నారు. గుణసేనుడు రాజయ్యాక ధర్మశాస్తాలను తిరగరాయించాడు. ఎందరు దోషులు తప్పించుకున్నా ఫరవాలేదు. ఒక్క నిర్దోషి కూడా శిక్షకు గురి కాకూడదనేదే గుణసేనుడి లక్ష్యం. న్యాయం జరగడంలో జాప్యం జరగవచ్చేమోకానీ, చట్టం నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరని రాజు చెబుతుండేవాడు. చట్టం తనపని తాను తప్పించుకోలేరని విశ్వసిస్తాడు. అలాంటిది ఆయనకే ఇప్పుడు సంకట పరిస్థితి తలెత్తింది. నిందితునిగా నిలబడిన వ్యక్తి సామాన్యుడుకాదు. తన భార్యకు తమ్ముడు. పైగా ఆగర్భ శ్రీమంతుడు. రేపు యుద్ధం వస్తే బల్మాన్ థాన్ అండలేకుండా ఏమీ చేయలేడు. ఒక్క మాటలో చెప్పాలంటే మహాభారతంలో విరటుడు లాంటి వాడు.

బల్మాన్ థాన్ ఒక రోజు రాత్రి తన రథాన్ని తీసుకుని రయ్యినపోతూ, మధ్యలో ఓ పానశాలలో ఆగాడు. అక్కడ మత్తుని బాగా తలకెక్కించుకున్నాడు. ఆ గంభీరమైన మత్తులో తానే రథాన్ని నడుపుకుంటూ పోతున్నాడు. అసలే చీకటి , ఆపైన తలకెక్కిన మత్తు. రథం అదుపు తప్పింది. అయినా గుర్రాలను కొరడా ఝుళిపిస్తూ వేగిరపరుస్తున్నాడు. అంతే, రథం రహదారి పక్కనే ఉన్న గుడిసెలవైపు అడ్డదిడ్డంగా పరిగెత్తుతూ, నానాబీభత్సం సృష్టించింది. ఈ సంఘటనలో నిద్రిస్తున్న సామాన్యుడు చనిపోయాడు. నలుగురికి గాయాలయ్యాయి. రక్షకభటాధికారి వచ్చి చూశాడు. చనిపోయినవాళ్లు పేదలు. కనబడుతూనే ఉంది. చంపినవాడు రాజుగారి బావమరిది. అది కనబడుతూనే ఉంది. అంతే, జరగబోయేదేమిటో అతని కళ్లముందు కనిపించింది.

సంఘటన జరిగిన 13 ఏళ్లకు ఉన్నత న్యాయసభ విచారణ చేపట్టింది. పూర్వాపరాలు తెలుసుకున్న తర్వాత మహాధర్మమూర్తి తీర్పు ప్రకటించారు. రాజు చాలా ఉత్కంఠతో వింటున్నట్లు కనిపించాడు. బల్మాన్ థాన్ తన రథాన్ని సామాన్యులైన గుడిసెవాసులపై పోనిచ్చిడాన్నది అభియోగం. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బల్మాన్ మద్యం మత్తులో ఉన్నారని న్యాయవాదులు తగిన సాక్ష్యాలతో నిరూపించలేకపోయారు. ఇంతకు ముందు మరో న్యాయసభ ప్రకటించిన జైలు శిక్షను కొట్టేస్తూ బల్మాన్ థాన్ ని నిర్దోషిగా ప్రకటిస్తూ మహాధర్మమూర్తి తీర్పు పాఠం చదివారు. అంతా రాజు ముఖంవైపు చూశారు. వయసుపెరిగి, దట్టంగా ఉన్న గుబురు మీసాలు, గడ్డాల మాటున దాగున్న భావాలేమిటో ప్రజలు పసిగట్టలేకపోయారు. గుణసేనుడు ఓసారి తన తెల్లటి గడ్డాన్ని నిమిరుకున్నాడు. మహామంత్రి వైపు చూశారు. ఆయన ఒక్క క్షణం రాజుగారి కళ్లలోకి చూసి, వెంటనే తలపంకిస్తూ దీర్ఘాలోచనలో పడిపోయారు.

అది రాజుగారి ఆంతరంగిక మందిరం. మహామంత్రి ఒక్కరే ఉన్నారు. రాజు గారు అడిగారు `ఇది ఎలా సాధ్యమైంది మంత్రిగారూ..!’ మంత్రి చెప్పడం ప్రారంభించారు. `రాజా, తమరి దయవల్ల రాజ్యంలో ధర్మశాస్త్రం, వాటిని అమలుపరిచే చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బల్మాన్ థాన్ కు శిక్ష పడటం ఖాయం. మన ధర్మమూర్తులు ఎప్పటికీ ధర్మాన్ని వీడరు. వారు పుణ్యాత్ములు. ఏ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదన్న ధర్మనియమాన్ని పాటిస్తుంటారు ‘ మంత్రి ఆగారు.

`మరి అలాంటప్పడు ఒకే అభియోగానికి రెండు రకాల తీర్పులు రావడమేమిటీ?’ రాజు ప్రశ్నించాడు.

మంత్రి తన గడ్డం నిమురుకుంటూ, `రాజా తమకు తెలియనిది ఏమున్నదీ, న్యాయం కోసం ఎగువ న్యాయసభకు వెళ్ళే స్వేచ్ఛ పౌరులకు మీరిచ్చినదేకదా… తీర్పుకీ తీర్పుకీ మధ్య సాక్ష్యాలను బలహీనపరిచాము . బల్మాన్ రథ చక్రాల క్రిందపడి గాయపడిన వారిచ్చిన వాంగ్మూలాల్లో పరస్పర విరుద్ధ అంశాలు ఉండేలా చూశాము. రక్షకభటాధికారి ఇచ్చిన వాంగ్మూలంపై ధర్మమూర్తిగారికి సందేహాలు కలిగేలా చూశాము’

`ఇదంతా బాగానే ఉంది, కానీ మత్తు తలకెక్కినట్లు గుర్తించారుకదా… మరి ఆ సాక్ష్యం…?’

`బల్మాన్ థాన్ రక్త నమూనాను రసాయనిక శాస్త్రవేత్తలు పరిశీలించి మత్తు తీసుకున్నట్లు చెప్పినమాట నిజమే, కానీ సదరు సాక్ష్యానికి సంబంధించిన నివేదికలను మార్చేసి కృత్రిమమైనవి ఉంచడంతో ధర్మమూర్తులకు సందేహం కలిగింది. సదరు పత్రాలు తప్పుగా ఉన్నట్లు భావించారు. పైగా బల్మాన్ మత్తు వల్ల ప్రమాదం జరిగిందా ? లేక రధ చక్రాలకు నట్లు ఊడిపోవడం వల్ల జరిగిందా, కాకుంటే గుఱ్ఱాలకు మతిస్థిమితంలేక రథాన్ని ఈడ్చుకువెళ్ళాయా ?? అన్న విషయాల్లో గందరగోళం సృష్టించాము ప్రభూ…’

`భేష్, బాగున్నది. కానీ ఇంతకీ ఆ సామాన్యుడు ఎలా మరణించాడు? నలుగురు ఎలా గాయపడ్డారు? బల్మాన్ ఖాన్ నిర్దోషి అయితే, మరి తప్పెవరదంటారు మంత్రిగారూ..?’

`తప్పు గుడిసె వాసులదే ప్రభూ, రహదారి పక్కన గుడిసెలు వేసుకోవడం వారి తప్పు. రథాలు, గుఱ్ఱాలు తిరిగే రహదారికి ఆనుకుని వారు నిద్రించడం మహాపరాధం. వారు చేసిన తప్పుకు బల్మాన్ థాన్ ఎలా దోషి అవుతాడు ప్రభూ? మీరు అనుమతిస్తే ధర్మశాస్త్రాన్ని తిరగరాయిస్తాను’

`భేష్. అలాగే కానివ్వండి. బల్మాన్ వంటి వాళ్లకు ఎప్పటికీ ఇబ్బంది కలగకుండా చూడండి. అలాంటివారు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది’ అంటూ రాజు నిష్క్రమించారు.

బల్మాన్ థాన్ నిర్దోషి అని తేలడంతో ఆగర్భ శ్రీమంతులు పండుగ చేసుకున్నారు. న్యాయం, ధర్మం గెలిచినందుకు సంబరపడిపోయారు. మరో పక్క రాజభటులు రహదారికి ఇరువైపులా ఉన్న గుడిసెలను పీకించే పనిలో పడ్డారు. ధర్మం నాలుగుపాదాలా నడుస్తున్నందుకు రాజుగారు సంతోషంలో మునిగిపోయారు. ఎవరేమన్నా కథ ఇక్కడితో కంచికి వెళ్ళిపోయింది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close