2 వైకుంఠ పోస్టులు, కోట్లాది దరఖాస్తులు !

(సెటైర్)

అది మహా విష్ణువు పాలకడలిపై నివసించే వైకుంఠం. అయితే అది మునుపటిలాలేదు. ఈమధ్య విజిటర్స్ ఎవరు వెళ్లినా అక్కడ అడ్డగించే ద్వారపాలకులు కనబడటంలేదు.ఆ రెండు పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో వైకుంఠం ఎంట్రెన్స్ దగ్గర ఏదో వెలాతెలాపోతున్నట్టు దేవతలు ఫీలైపోతున్నారు.

రుషులు, దేవతలు, కిన్నెర, కింపురుషులు తదాదిగా వైకుంఠనాథుడ్ని దర్శించుకోవడానికీ, తమ సమస్యలు విన్నవించుకోవడానికి నిత్యం వేలాదిగా తరలివెళుతుంటారు వైకుంఠానికి. దేవదేవుడి దర్శనం చేసుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాల్సిందే. స్వామివారు ఏకాంతసేవలో ఉన్నా, లేదా రెస్ట్ తీసుకుటున్నా ఆయన్ని ఎవ్వరూ డిస్ట్రబ్ చేయకూడదు. అలాంటప్పుడు వచ్చినవాడు ఎంతవాడైనా ద్వారం వద్ద వెయిట్ చేయాల్సిందే. అందుకే మహావిష్ణువు బాగా నమ్మకస్తులైన వారినే ద్వారపాలకులుగా నియమించారు. జయవిజయులనే వారికి ఈ పోస్టులు ఏనాడో ఇచ్చేశారు. కానీ జయవిజయలు ఈమధ్యనే వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. దీంతో ఈ రెండు పోస్టులను భర్తీచేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

రెండు వైకుంఠ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలియగానే వైకుంఠంలోని అడ్మినిస్టేషన్ డిపార్ట్ మెంట్ కి కుప్పతెప్పలుగా దరఖాస్తులొచ్చిపడుతున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి పెట్టిన గడువుపూర్తయిన తర్వాత ఎన్నివచ్చాయో లెక్కగట్టే పనిని పాపపుణ్యాల చిట్కా రాయడంలో దిట్టైన చిత్రగుప్తులవారికే అప్పగించారు. తీరా లెక్కగట్టాక చిత్రగుప్తులవారి మైండ్ బ్లాకైంది.
అవదామరి, కేవలం రెండు వైకుంఠం పోస్టులకు, అది కూడా డ్యూటీ టైమంతా నిలబడి పనిచేసే ద్వారపాలక పోస్టులకు ఏకంగా ఆరుకోట్ల దరఖాస్తులొచ్చిపడితే.

విష్ణువు ఎదుట ఆరుకోట్ల దరఖాస్తులు కుప్పలుతెప్పలుగాపడున్నాయి. ద్వారపాలక పోస్టులకు దేవతాగణంలోని మహాజ్ఞానులు, శాస్త్రవేత్తలు, న్యాయకోవిదుల దగ్గరనుంచి గురుకుల ఆచార్యులు, అశ్వనీ వంటి వైద్యశిఖామణులు ఒకరేంటీ ఎంతో మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం విష్ణువునిసైతం ఆశ్చర్యపరచింది.

సరిగా అప్పుడే ఎంటరయ్యాడు నారదులవారు.

`నారాయణ, నారాయణ, ఏమిటీ స్వామివారు దీర్ఘాలోచనలో ఉన్నారు?’

`ఏమీలేదు ఈ కుప్పలను ఎలా కరిగించాలా అని.. ‘ విష్ణువు అన్నారు. ఆయన మోముపై చిద్విలాసం రవ్వంతైనా చెరగలేదు.

`ఇవన్నీ ఏమిటీ !!’ ఏమీ తెలియనివాడిలా అడిగాడు నారదుడు.

`అదే, మన వైకుంఠం రెండు ద్వారాపాలక పోస్టులు రెండు ఖాళీ అయ్యాయిగా, వాటిని భర్తీచేద్దామని ప్రయత్నిస్తుంటే ఇదిగో ఆరుకోట్ల అప్లికేషన్స్ వచ్చిపడ్డాయి ‘ మధ్యలో అందుకుంటూ చిత్రగుప్తుడన్నాడు.

`నారాయణ, నారాయణ !! పెద్ద సమస్యే వచ్చిపడింది’ నారదుని స్వరంలో వెటకారం ఉట్టిపడింది.

`నారదా, నాదగ్గరే వెటకారమా… ఇది సీరియస్ సమస్య. నాకు ఒక్క విషయం అర్థంకావడంలేదు, పెద్దపెద్ద పోస్టులకు సెలెక్ట్ అయ్యే ప్రతిభఉన్నవారుసైతం ఈ చిన్న పోస్టులకు ఎందుకు అప్లై చేశారో…’ అర్థాంతరంగా ఆగాడు విష్ణువు.

`నారాయణ, నారాయణ, తమకు తెలియనిదేముందిస్వామీ, ఈ మధ్య భూలోకంలో అందునా భారతదేశం ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి సంకటస్థితే ఎదురైంది’

`సంకట స్థితి ఎక్కడుంటే తమరు అక్కడుంటారుగా, చెప్పండి,చెప్పండి ఏమిటా సంకటం’ మధ్యలో అడ్డుతగిలాడు చిత్రగుప్తులవారు.

`వినండి స్వామీ, చిత్తగిస్తాను. అక్కడి సచివాలయంలో 368 ప్యూన్ పోస్టులు ఖాళీ అయితే ఏకంగా 23లక్షల దరఖాస్తులొచ్చిపడ్డాయి. అక్కడ కూడా ఇంతే, ఈ గ్రూప్ -డి పోస్టులకు బీటెక్ లూ, ఎంటెక్కులు, బీఎస్సీలు, ఎంఎస్సీలు, పిహెడీలు ఒకరనేంటీ అందరూ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎలా టాకిల్ చేయాలాఅని తెగ టెన్షన్ పడిపోతున్నారక్కడ’

`నారదా, అది భూలోకం…ఇది దైవలోకం, అందునా వైకుంఠం. మరి ఇక్కడ ద్వారపాలక పోస్టులకు ఇంత డిమాండ్ ఎందుకువచ్చిందంటావ్..? నిరుద్యోగ సమస్య అంత తీవ్రంగా ఉన్నదా!! ‘ యోగనిద్రనుండి అప్పుడేలేచినట్టున్న విష్ణువు నారదుడ్ని అడిగాడు.

`మీరన్నది నిజమే స్వామి. నిరుద్యోగ సమస్య తీవ్రంగానే ఉంది. అయితే ఈ సమస్యని దీనితో పోల్చడంకంటే, అవినీతితో పోల్చాలేమో దేవదేవా….’ నెమ్మదిగా లాజిక్ లోకి దింపాడు నారదుడు.

`అంటే ?? వివరంగా చెప్పు నారదా’

`ఏమున్నది స్వామీ, రాష్ట్ర సచివాలయంలో ప్యూన్ పోస్ట్ ఎలాంటిదనుకున్నారు…బంగారు బాతుగుడ్డుతో సమానం. ఎంత హైటెక్ జాబ్ లు చేస్తే మాత్రం అంత సంపాదన వస్తుందా హన్నన్నా…అందుకే వైట్ కాలర్ జాబ్స్ కంటే పచ్చనోట్లతో పచ్చగా ఉండే బంట్రోతు పోస్టే బెస్టని అక్కడివాళ్లంతా డిసైడ్ పోయారు స్వామి’

`అందుకే అన్నారు, దేవుడికంటే పూజారికే విలువెక్కువని’ అంటూ చప్పున నాలుక్కరుచుకున్నాడు చిత్రగుప్తులవారు.

`సెటైర్లొద్దు, సొల్యూషన్ కావాలి. భూలోకవాసులంటే నిత్య సౌర్థపరులు. దేవతలు అలాకాదే, లోకాపకారులు. అవ్వారి నైజానికీ, ఇవ్వారి మనస్తత్వానికీ దోమకీ ఏనుగకీ ఉన్నంత తేడాఉందికదా…మరి అలాంటప్పుడు !?…’ సందిగ్దంగా అడిగారు మహావిష్ణువు.

`జగన్నాటక సూత్రధారులు తమకు తెలియనిదేముందీ, కాకపోతే మీరు యోగనిద్రలో ఉన్న సమయంలో చాలా విశేషాలు జరిగాయి. ద్వారపాలకుల హవా పెరిగిపోయింది. పేరుకు ద్వారపాలకులే అయినా ఇద్దరి సంపాదన దాదాపు కుబేరుని ఆస్తికి చేరిపోయిందన్న గుసగుసలు మన దేవలోకంలో వినబడుతున్నాయి. దాదాపు వందతరాలకు సరిపడా సంపాదించారట. అందుకే ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నారని కూడా అనుకుంటున్నారు స్వామీ…. ఇప్పుడు అలాంటి బంగారుకొండలాంటి పోస్టులు ఖాళీ అయితే, ఎవరూరుకుంటారు, అందుకే, దేవతలు ఎగబడుతున్నారు. ఒకప్పుడు మూడు కోట్లు ఉండే దేవతల జనాభా కాస్తా 300 కోట్లకు పెరిగిపోయిందాయె. ఇక అంతా కోట్లలోనే లెక్కలు’

`అర్థమైంది నారదా, దివ్యదృష్టితో అంతా అర్థంచేసుకున్నాను. మానవునికి ఏ కష్టమొచ్చినా ఆదుకుంటూనేఉన్నాను. అందుకేగా నా అవతారాలు. కానీ, వారేమో..’

`మీరన్నది నిజమేస్వామి. మీకేమో మానవులంటే అత్యంత ప్రీతి. ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడే మాధవుడన్నంత లిబరల్ గా ఆలోచిస్తారు మీరు. ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడని అనుకుంటారు మీరు. కానీ…’

`కానీ…ఏమిటీ నారదా…సస్పెన్స్ తట్టుకోలేకుండా
ఉన్నాను’ తొందరపెట్టాడు చిత్రగుప్తులవారు.

`కానీ, దేవతలు కూడా అదే ఫార్ములాలోకి వెళ్లడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైంది స్వామి’

`అంటే, నీఉద్దేశం. మాధవుడే మానవుడనా…’

`అమ్మో, తమరిని ఈ సంకటంలోకి లాగనిస్తానా స్వామీ…’

`పోనీ, మనిషిలోనే దేవుడున్నాడన్న సిద్దాంతానికి రివర్సా..?? అంటే, ప్రతి దేవుడిలోనూ మానవుడు ఉన్నాడనా….!!! ఒహ్..ఇప్పుడర్థమైంది. ప్రతి దేవుడిలో మానవుని చిత్త ప్రవృత్తి ప్రవేశించి, అది కొండంతగా ఎదిగిందనేగా నువ్వు
అనేది’

`అయ్యో, మధ్యలో నేన్నదేముందీ, తమరే సెలవిచ్చారాయె…ఇలా దేవుళ్లలో మానవ నైజం పెరిగిపోవడంతో ఇక్కడ కూడా స్వార్థచింతన, లంచగొండితనం, అవినీతి పెరిగిపోయాని వేరుగా చెప్పాలా స్వామి. దీని ఫలితమే ఇవ్వాళ రెండు అల్పాదాయ పోస్టులకు పెద్దపెద్ద దేవుళ్లు సైతం అప్లై చేశారు’ విరణ ఇచ్చాడు నారదుడు.

`మరి దీనికి పరిష్కారం?’ అడిగాడు చిత్రగుప్తుడు. ఇక్కడ తన డిప్యుటేషన్ వర్క్ త్వరగా పూర్తిచేసుకుని యమలోకం వెళ్ళాలన్న తొందర్లో ఉన్నాడు.

`ఏమున్నదీ, దేవతల్లో మానవ వికారాలవల్ల పుట్టిన సమస్య కాబట్టి, ఈ సమస్యకు పరిష్కారం కూడా మానవ సాంకేతిక విజ్ఞానంతోనే సాధించాలి’ క్లూ ఇచ్చాడు నారదుడు.

`అర్థమైంది నారదా, ఈ సమస్య పరిష్కారానికి ఒక్కటే మార్గం. ఇవ్వాళ్టి నుంచి ఈ రెండు ద్వారపాలక పోస్టులను తీసేస్తున్నాను. వైకుంఠానికి `ఈ-ఎంట్రెన్స్’ పద్ధతి ప్రవేశబెడుతున్నాం. ఇకపై ఎవరైనా వైకుంఠానికి వస్తే, వారు ముందుగా డిటైల్స్ ను ఎంటర్ చేసి యూనివర్శల్ పాస్ వర్డ్ ఉపయోగిస్తే చాలు, వారికి ప్రవేశం ఇవ్వాలా వద్దాఅన్నది కంప్యూటర్ తేలుస్తుంది. స్కానింగ్ అయ్యాక అంతా సరిగాఉంటే, వాటంతట అవే వైకుంఠ తలుపులు తెరుచుకుంటాయి.’

విష్ణువు ఇలా నిర్ణయం తీసుకున్నారో లేదో… మరుక్షణం, అక్కడ కుప్పలతెప్పలుగా పడున్న కోట్లాది దరఖాస్తులు మాయమైపోయాయి. సమస్యకూడా మటుమాయం.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close