జల్లికట్టు రాజకీయాలకు సుప్రీం సుత్తి దెబ్బ!

తమిళనాడులో ప్రతీ చిన్న అంశానికి కూడా ఒక రాజకీయ కోణం ఉంటుంది. ఉంటుంది అనే కంటే అక్కడి రాజకీయ పార్టీలు వాటితో రాజకీయాలు చేయడం ఒక ఆనవాయితీగా మార్చేసాయని చెప్పవచ్చునుపైగా ఈ ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక ఇక ఈ రాజకీయరంగులు ఇంకా ఎక్కువగా కనబడుతాయి. కనుక ప్రతీ ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రమంతటా నిర్వహించే జల్లికట్టు ఎద్దుల పోటీలకు కూడా ఆ రాజకీయరంగు అంటుకొంటే అదేమీ పెద్ద విశేషం కాదు. కానీ ఆ రాజకీయాలు..రంగుల గురించి పట్టించుకోని జంతు ప్రేమికులు జల్లికట్టు క్రీడపై చాలా కాలంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలు తరుముకొస్తున్న ఈ సమయంలో ప్రజలను ప్రసన్నం చేసుకోవాలంటే వారి అభీష్టం మేరకు జల్లికట్టు క్రీడను నిర్వహించాలని జయలలిత నేతృత్వంలో అధికారంలో ఉన్న అన్నాడిఎంకె ప్రభుత్వం భావించడం అసహజమేమి కాదు. ఒకవేళ అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే, దాని నిర్వహణ కోసం పోరాడి ఆ క్రెడిట్ కొట్టేసేందుకు ప్రతిపక్షాలు సిద్దంగా కాచుకు కూర్చొన్నాయి. కనుక తమ పార్టీకే దానిపై ఎక్కువ శ్రద్ధ ఉందని నిరూపించుకోవలసి ఉంటుంది కనుక ఈ క్రీడను అనుమతించమని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం వెంటనే కేంద్రప్రభుత్వానికి ఒక లేఖ వ్రాసింది.

తమిళనాడులో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చాలా కాలంగా కలలు కంటున్నారు. అయితే బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలు ఎంత బలమయిన జాతీయ పార్టీలు అయినప్పటికీ తమిళనాడులో నిలద్రొక్కుకోవాలంటే తప్పనిసరిగా అక్కడ బలంగా ఉన్న అధికార అన్నాడిఎంకె పార్టీ లేదా ప్రతిపక్ష డిఎంకె పార్టీలలో దేనితో ఒక దానితో జత కట్టక తప్పదు. లేకుంటే అక్కడ వాటికి ఒక్క ఓటు కూడా రాలదు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడిఎంకె పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని చాలా కాలంగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల చెన్నైని వరదలు ముంచెత్తినప్పుడు ప్రధాని నరేంద్ర మోడి వెంటనే చెన్నై బయలుదేరి వెళ్లి జయలలితను కలవడం, ఆ రాష్ట్రానికి అడగక ముందే బారీ ఆర్ధిక సహాయం చేయడం, ఆ తరువాత జల్లికట్టు క్రీడపై లేఖ అందగానే హడావుడిగా ఉత్తర్వులు జారీ చేయడం వగైరాలన్నీ జయలలితను ప్రసన్నం చేసుకొని అన్నాడిఎంకె పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడానికేనని వేరేగా చెప్పనవసరం లేదు. కానీ జల్లికట్టు క్రీడపై సుప్రీం కోర్టు నిన్న స్టే విధించడంతో ఆ రెండు పార్టీలకి చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురయింది.

అప్పుడే తమిళనాడులో ప్రతిపక్ష పార్టీలు దీనిని మంచి అవకాశంగా వాడేసుకొంటున్నాయి. అధికార అన్నాడిఎంకె పార్టీకి ప్రజాభీష్టం పట్టించుకోదని అందుకే సుప్రీం కోర్టులో గట్టిగా వాదించలేదని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రీడ జరగకపోవడానికి అధికార పార్టీయే దోషి అని నిందిస్తున్నాయి.

ఈ సమస్య నుండి తమిళనాడు ప్రభుత్వాన్ని బయటపడేయకపోతే అమ్మకి బీజేపీపై ఆగ్రహం కలుగుతుంది. అలుగుతుంది. పొత్తులకు ‘నో’ చెప్పేస్తుంది. కనుక ఈ సమస్య పరిష్కరించవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే. ఒకవేళ కేంద్రప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించలేకపోతే అప్పుడు అమ్మ ఆ సమస్యను తనదయిన శైలిలో పరిష్కరించవలసి ఉంటుంది. లేకుంటే ప్రతిపక్షాలు దీనిపై రచ్చ రచ్చ చేసేసి ప్రజలను తమవైపు తిప్పేసుకొంటాయి. కనుక అమ్మ కూడా ఈ జల్లికట్టు బాల పరీక్షలో పాస్ అవకతప్పదు.

ఈ విషయంలో కేంద్రప్రభుత్వం ఏమీ చేయలేనందుకు ఒకవేళ అమ్మకి ఆగ్రహం వచ్చేస్తే, అప్పుడు చక్రాల కుర్చీలో కూర్చొని రాజకీయాలు చేస్తున్న డి.ఎం.కె. అధ్యక్షుడు కరుణానిధి ముందు పొత్తుల కోసం బీజేపీ సాగిలపడక తప్పదు.

ఏమిటో ఈ రాజకీయాలు…ఆ..అన్నట్లు నిన్న చెన్నై సముద్ర తీరానికి సుమారు వంద భారీ వేల్ చేపలు కొట్టుకువచ్చేయి..వాటిలో 42 చేపలను మాత్రమే సముద్రంలోకి పంపించగలగడంతో బ్రతికాయి. మిగిలినవన్నీ చచ్చిపోయాయి. అధికార పార్టీ అదృష్టమో లేక ప్రతిపక్ష పార్టీల దురదృష్టమో కానీ దీనిని తమిళనాడు ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. పట్టించుకొని ఉండి ఉంటే చనిపోయిన వేల్ చేపలు కూడా తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసి ఉండేవి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజధాని తరలింపుపై కొత్త కదలికలు నిజమేనా..!?

రాజధాని తరలింపు బిల్లులను మళ్లీ అసెంబ్లీలో పెట్టడంపై.. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతకు ముందు ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. అక్కడ ఆలస్యం అవుతూండటంతో.. సుప్రీంను ఆశ్రయించారు....

కాపు నేస్తం పథకం దుర్వినియోగం

కాపులకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చానంటూ.. కాపు నేస్తం అనే పథకాన్ని పెట్టిన ఏపీ సర్కార్.. ఆ పథకం పేరుతో రెడ్డి సామాజికవర్గానికి సాయం చేశారన్న విమర్శలు కొంత కాలం నుంచి వస్తున్నాయి. దానికి...

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు చట్ట ఉల్లంఘనేనన్న కేఆర్ఎంబీ..!

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పేరుతో.. సంగమేశ్వరం వద్ద నుంచి నీటిని ఎత్తి పోసుకునే ప్రాజెక్ట్‌కు.. రూపకల్పన చేసిన ప్రభుత్వం.. దానికి అభ్యంతరాలు రాకుండా.. చేసుకోవడంలో మాత్రం దారుణంగా విఫలమయింది. చివరికి కృష్ణా బోర్డును...

22న ఏపీలో ఇద్దరు కొత్త మంత్రుల ప్రమాణం..!

రాజ్యసభకు ఎన్నికయిన పిల్లి, మోపిదేవి స్థానాల్లో ఇద్దరు కొత్త మంత్రులను.. ఏపీ కేబినెట్‌లోకి ఇరవై రెండో తేదీన కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ పెద్దలు ముహుర్తం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది....

HOT NEWS

[X] Close
[X] Close