జల్లికట్టు క్రీడ నిర్వహించడానికి వీల్లేదు: సుప్రీం కోర్టు

తమిళనాడు రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతీ ఏటా జల్లికట్టు క్రీడని నిర్వహిస్తుంటారు. ఆ క్రీడలో బలిష్టమయిన ఎద్దులను వరుసగా ఒక దాని తరువాత ఒకటిగా ఓకే మార్గంలో విడిచిపెడుతుంటే వాటిని యువకులు అడ్డుకొని లొంగదీయడమే ఈ ఆట. నోరులేని జీవాలను వేలాదిమంది చుట్టుముట్టి వాటిని భయబ్రాంతులను చేసి లొంగదీసే ఈ క్రీడను జంతు ప్రేమికులు నిషేధించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ తమిళనాడు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రప్రభుత్వం ఆ క్రీడను అనుమతిస్తూ జనవరి 7,2016న ఉత్తర్వులు జారీ చేసింది. దానిని యానిమల్ వెల్ఫేర్ ఫోర్డ్ ఆఫ్ ఇండియా,ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్, కమాసియన్ అన్-లిమిటెడ్ ప్లస్ యాక్షన్, పెటా(పి.ఈ.టి.ఏ.) మరియు మరికొందరు వ్యక్తులు సుప్రీం కోర్టులో సవాలు చేసారు. వారి పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన సుప్రీం కోర్టుధర్మాసనం కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విదించింది. తమిళనాడులో జల్లికట్టు క్రీడ నిర్వహించడానికి వీలులేదని తేల్చి చెప్పింది.

కేంద్రప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ముకుల్ రోహాత్గీ వాదిస్తూ ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం కొన్ని సంస్కృతీ, సంప్రదాయాల అమలుకు అంగీకరించక తప్పనిసరి పరిస్థితులు ఉంటాయని, ఈ క్రీడలో పాల్గొనే ఎద్దులకు ఎటువంటి ప్రమాదం జరగదని, అందులో పాల్గొనే యువకులే ఎక్కువగా గాయపడుతుంటారని కనుక అనాదిగా సాగుతున్న ఈ క్రీడని అనుమతించవలసిందిగా ఆయన సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని అభ్యర్ధించారు. తమిళనాడు ప్రభుత్వం తరపున వాదించిన ఎల్.ఎన్.రావు అనేక శతాబ్దాలుగా సాగుతున్న ఈ జల్లికట్టు క్రీడ రాష్ట్ర ప్రజల సంస్కృతీ, సంప్రదాయాలలో ఒక భాగమని, కనుక ఇందులో పాల్గొనే ఎద్దులకు, అలాగే మనుషులకు కూడా ప్రమాదాలు జరగకుండా అవసరమయిన అన్ని జాగ్రత్తలు తీసుకొంటారని కనుక ఈ క్రీడను కొనసాగించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసారు.

కానీ సుప్రీం ధర్మాసనం నిర్ద్వందంగా వారి అభ్యర్ధనలను త్రోసిపుచ్చుతూ కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ కేసులో మరింత వివరణ కోరుతూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపించి, ఈ కేసును మళ్ళీ మార్చి 15కి వాయిదా వేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com