సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను కార్పొరేషన్లో కలపాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే ఏకంగా నిరాహారదీక్ష చేస్తున్నారు. కంటోన్మెంట్ తెలంగాణ.. హైదరాబాద్ లో భాగమే అయినా అదో ప్రత్యేక సామ్రాజన్యం. ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల నివసించే వారికి కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఇబ్బందులు ఉంటాయి. అందుకే ప్రజలు కంటోన్మెంట్ ను కార్పొరేషన్ లో కలపాలని ఉద్యమాలు చేస్తున్నారు.
ఆర్మీ అధికారి నేతృత్వంలో పాలన
1798లో అప్పటి హైదరాబాద్ నిజాం – రెండవ అసఫ్ జా, బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో చేసుకున్న సైన్య సహకార ఒప్పందం వంల్ల ఈ కంటోన్మెంట్ రూపుదిద్దుకుంది. నిజాం రక్షణ కోసం బ్రిటీష్ సైన్యాన్ని ఇక్కడ మోహరించారు. కంటోన్మెంట్ పాలన సాధారణ మున్సిపాలిటీలకు భిన్నంగా ఉంటుంది. ఇది కంటోన్మెంట్ చట్టం, 2006 ప్రకారం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ద్వారా నిర్వహించబడుతుంది. ఈ బోర్డులో ఆర్మీ అధికారులతో పాటు ఎన్నికైన సభ్యులు ఉంటారు. దీనికి బ్రిగేడియర్ స్థాయి అధికారి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
కంటోన్మెంట్ బోర్డు పర్యవేక్షణలోనే అన్నీ పనులు
ఇక్కడ రోడ్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, భవన నిర్మాణ అనుమతులు వంటి పౌర సేవలను రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర బోర్డే పర్యవేక్షిస్తుంది. దీనివల్ల జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సౌకర్యాలు, పథకాలు ఇక్కడ ప్రజలకు నేరుగా అందవు. కంటోన్మెంట్ భూములు , దాని నిర్వహణ పూర్తిగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటాయి కాబట్టి, దానిని విలీనం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. అయితే, విలీన ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం కీలకం. ఎందుకంటే పౌర ప్రాంతాలను విలీనం చేసిన తర్వాత వాటిని నిర్వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్ .
ఇప్పటికే ప్రక్రియ ప్రారంభం
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విలీనానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా 2024 జూన్ నెలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని పౌర ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం కంటోన్మెంట్ ప్రజలు ప్రధానంగా రెండు సమస్యలపై పోరాడుతున్నారు. మొదటిది, విలీన ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యం. రెండవది, స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల ప్రజాప్రతినిధులు లేక పౌర సమస్యలు పరిష్కారం కాకపోవడం. సైనిక రక్షణ దృష్ట్యా మూసివేసిన రోడ్లను తెరిపించడం, జీహెచ్ఎంసీ తరహాలో ఉచిత నీటి సరఫరా , ఇతర సంక్షేమ పథకాలు పొందడం కోసం ఈ విలీనం త్వరగా జరగాలని కోరుకుంటున్నారు.
