సికింద్రాబాద్ , మల్కాజిగిరి మధ్య పోటీ ప్రారంభమయింది. ఔటర్ లోపల ఉన్న నగరం మొత్తాన్ని గ్రేటర్ లో విలీనం చేసింది ప్రభుత్వం. మొత్తం మూడు వందల వార్డులు చేసింది. ఇప్పుడు మూడు కార్పొరేషన్లుగా విభజించేందుకు సిద్ధమయింది. ఆ మూడు హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్. ఇక్కడ మల్కాజిగిరిలో సికింద్రాబాద్ ఉంటుంది. అదే సెంటిమెంట్ రాజకీయాలకు కేంద్రంగా మారింది.
స్థానిక రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు, నివాసితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మల్కాజ్‌గిరిలో కలిపితే సికింద్రాబాద్ తన స్వయంప్రతిపత్తిని, చారిత్రక గుర్తింపును కోల్పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్‌గిరిలో విలీనం వద్దు – సికింద్రాబాద్‌కు ప్రత్యేక కార్పొరేషన్ ముద్దు అనే నినాదంతో ఉద్యమిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి గతంలో గెలిచి ఇప్పుడు సనత్ నగర్ నుంచి పోటీ చేస్తున్న తలసాని ఈ ఉద్యమానికి నాయకత్వం వహించేందుకు రెడీ అయ్యారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులోని సివిల్ ఏరియాలను కూడా కలిపి, సికింద్రాబాద్‌ను ఒకే ఒక ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పరిపాలన సులభతరమవుతుందని, స్థానిక సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని వారు వాదిస్తున్నారు. లష్కర్ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని.. సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా లేదా ఒకే కార్పొరేషన్‌గా ఉంచాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు.
సికింద్రాబాద్‌కు 200 ఏళ్లకు పైగా ఘనమైన చరిత్ర ఉంది. 1956 వరకు ఇది ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉండేది, ఆ తర్వాతే హైదరాబాద్‌తో విలీనమైంది.
