ముంబైలో బతుకుతున్న దక్షిణాది ప్రజలకు సమస్యలు తెచ్చి పెట్టేలా తమిళనాడు బీజేపీ నేత చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి ముంబై వెళ్లిన తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ముంబై కేవలం మహారాష్ట్రకు చెందిన నగరం మాత్రమే కాదని, అది ఒక అంతర్జాతీయ నగరమని ప్రకటించారు. బీజేపీ మేయర్ ఎన్నికైతేనే దానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని అన్నామలై ప్రకటన చేశారు.
ఈ వ్యాఖ్యలు ముంబై అస్తిత్వాన్ని, మరాఠీ ప్రజల ప్రాముఖ్యతను తగ్గించేలా ఉన్నాయంటూ శివసేన , ఎంఎన్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం అన్నామలై చేస్తున్న ఈ ప్రయత్నం చివరకు ఇక్కడ దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉంటున్న దక్షిణాది వారిని రిస్క్ లోకి నెట్టే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాజ్ థాక్రే అన్నామలైను రసమలై అని ఎద్దేవా చేస్తూ.. శివసేన పాత నినాదం హటావో లుంగీ, బజావో పుంగీ ని మళ్ళీ గుర్తు చేస్తూ ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిల్చారు.
ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసే ఏ ప్రయత్నాన్ని అయినా సహించేది లేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారు ముంబై గడ్డపై కాలు పెట్టనివ్వబోమని హెచ్చరించారు. శివసేన పత్రిక సామ్నాలో అన్నామలై ముంబైలో అడుగు పెడితే కాళ్లు తీసేస్తామని హెచ్చిరంచారు. దీనికి అన్నామలై కూడా తగ్గకుండా సమాధానమిచ్చారు. తాను ముంబై వచ్చి తీరుతానని, దమ్ముంటే తన కాళ్లు నరకాలని సవాలు విసిరారు. ముంబై అభివృద్ధిలో దక్షిణాది వారి పాత్ర కూడా ఉందని ఆయనంటున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు చివరకు ధారవి వంటి ప్రాంతాల్లో నివసించే వేలాది మంది దక్షిణాది కూలీలు, వ్యాపారుల భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందన్న ఆందోళన అక్కడి దక్షిణాదివారిలో వ్యక్తమవుతోంది.
