రివ్యూ: సిటీమార్‌

రేటింగ్: 2.5/5

క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల్లో చాలా సౌల‌భ్యాలుంటాయి. కొత్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం లేదు. అన్నీ ఓ మీట‌ర్ లో ఉంటే స‌రిపోతుంది. కాక‌పోతే ఆ మీట‌ర్ ని సెట్ చేయ‌డం తెలిసి ఉండాలి. ఫైటు, పాట‌.. ఎలివేష‌న్లు… ఇవే క‌మ‌ర్షియ‌ల్ హంగులు అనుకోకూడ‌దు. వాటిమ‌ధ్య థ్రెడ్ చాలా ముఖ్య‌మైంది. క‌మ‌ర్షియ‌ల్ హంగుల్ని క‌ట్టిప‌డేసే ఓ దారం చాలా అవ‌స‌రం. అది ఎంత బ‌లంగా ఉంటే, క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు అంత బాగా ఆడ‌తాయి. ర‌చ్చ‌, బెంగాల్ టైగ‌ర్ సినిమాల‌తో త‌న‌కు క‌మ‌ర్షియ‌ల్ స్కేల్ తెలుసు అని నిరూపించుకున్నాడు సంప‌త్ నంది. ఇప్పుడు దానికి క‌బ‌డ్డీ నేప‌థ్యం జోడించి `సిటీమార్‌` అనే క‌థ రాసుకున్నాడు. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? సిటీ కొట్టించే మేట‌రూ… ఆ క‌మ‌ర్షియ‌ల్ మీట‌రూ… సిటీమార్ లో ఉన్నాయా? లేదా?

కార్తీక్ (గోపీచంద్‌) ఓ క‌బ‌డ్డీ కోచ్‌. త‌న ఊర్లోని అమ్మాయిల్ని పోగేసి, వాళ్ల‌కు కబ‌డ్డీ ట్రైనింగ్ ఇస్తుంటాడు. వీళ్లంద‌రితోనూ.. నేష‌న‌ల్స్ ఆడించాల‌న్న‌ది త‌న కోరిక. దానికి ఓ బ‌ల‌మైన కార‌ణం కూడా ఉంటుంది. త‌న ఊర్లోని స్కూలుని కాపాడుకోవ‌డం. అందుకే ఎంత క‌ష్ట‌మైనా ఆ ఊర్లోవాళ్ల‌ని ఒప్పించి, మేనేజ్‌మెంట్ ని మెప్పించి, త‌న టీమ్ ని ఢిల్లీకి తీసుకెళ్తాడు. నేష‌న‌ల్స్ లో.. ఆంధ్రా టీమ్ ఫైన‌ల్ వ‌ర‌కూ వెళ్తుంది. అయితే ఫైన‌ల్స్‌కి రెండు రోజుల ముందు.. టీమ్ మొత్తాన్ని కిడ్నాప్ చేస్తాడు ఓ లోక‌ల్ దాదా. తన బారీ నుంచి… కార్తీక్ త‌న టీమ్ ని ఎలా కాపాడుకున్నాడు.? అస‌లు ఆంధ్రా క‌బ‌డ్డీ టీమ్ ని కిడ్నాప్ చేయాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి వ‌చ్చింది? అనేదే మిగిలిన క‌థ‌.

క‌బ‌డ్డీ నేప‌థ్యానికి ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్, రొటీన్ రొడ్డ‌కొట్టుడు క‌థ‌ని జోడించాడు సంప‌త్ నంది. ఓ హీరో. అత‌ని బావ ఓ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌. అలాంటి సిన్సియ‌ర్ పోలీసోళ్ల‌కు విల‌న్ నుంచే క‌దా ముప్పు. ఈ క‌థ‌లోనూ అంతే. ఆ ముప్పు అటు తిరిగి, ఇటు తిరిగి.. క‌బ‌డ్డీ టీమ్ పై వ‌చ్చి ప‌డుతుంది. క‌బ‌డ్డీ కోచ్ హీరోనే కాబ‌ట్టి త‌న టీమ్ నీ, బావ‌నీ కాపాడేసుకుంటాడు. సో.. క‌థ మొద‌ల‌వ్వ‌గానే, క్లైమాక్స్ ఏంటో ఊహించేయొచ్చు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో క‌థ‌ల కంటే, క‌మ‌ర్షియ‌ల్ మీట‌రే ముఖ్యం కాబ‌ట్టి.. ఆ విష‌యానికొద్దాం. రావు ర‌మేష్ తో హీరోకి ఉన్న వైరం, రావు ర‌మేష్ ఇంట్లో పెళ్లి చూపుల సీన్ కోసం… ఆంటీలంతా విజృంభించి, ఫక్తు తెలుగు మాస్ డైలాగుల్ని ఊద‌ర‌గొట్టేయ‌డం, రావు ర‌మేష్ రియాక్ష‌న్ పంచ్‌లూ ఇవ‌న్నీ – సిటీమార్ కొట్టించేలానే తీర్చిదిద్దాడు సంప‌త్ నంది. తెలంగాణ కోచ్ గా త‌మ‌న్నాని రంగంలోకి దింపి – త‌న దూకుడు చూపించ‌డం కూడా మాస్ కి న‌చ్చేలానే ఉంది. ఇంట్ర‌వెల్ ముందు ఫైట్‌.. ఆ త‌ర‌వాత క‌బ‌డ్డీ టీమ్ కిడ్నాప్ అయి.. విల‌న్ హీరోకి టార్గెట్ ఫిక్స్ చేయ‌డం – వ‌గైరా వ‌గైరాలు మాస్, యాక్ష‌న్ పంథాలోనే సాగిపోయాయి.

తొలి స‌గం కాస్త బెట‌ర్‌గానే ఉంది. ఎందుకంటే అక్క‌డ‌క్క‌డ ఫ‌న్ వ‌ర్క‌వుట్ అయ్యింది. అమ్మాయిలంతా… త‌మ‌ని అల్ల‌రి చేస్తున్న రౌడీ మూక‌తో క‌బ‌డ్డీ ఆడేసే సీన్ బాగా వ‌చ్చింది. అమ్మాయిలంతా క‌ల‌సి రౌడీల‌ను ర‌ఫ్ఫాడించ‌డంలో ఉన్న థ్రిల్ చూపించాడు సంప‌త్ నంది. త‌మ పిల్ల‌ల్ని క‌బ‌డ్డీ ఆడించ‌డానికి త‌ల్లిదండ్రులు ఒప్పుకోన‌ప్పుడు వాళ్ల‌తో హీరో మాట్లాడే సీన్ – దేశంలోని అమ్మాయిల ప‌రిస్థితి, వాళ్ల‌కు ఎదుర‌వుతున్న అవ‌మానాల‌కు అద్దం ప‌డుతుంది.

అయితే ద్వితీయార్థంలో క‌థ పూర్తిగా న‌త్త‌న‌డ‌క న‌డుస్తుంది. హీరో – హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ అనేది లేనే లేదు. `బాలా రెడ్డి .. బాలారెడ్డి` లాంటి మాసీ ట్యూన్ చేసి పెట్టేసుకున్నారు కాబ‌ట్టి, దాన్ని వాడాలి కాబ‌ట్టి… ఏదో ఓ సందులో ఇరికించేశారు. పెప్సీ ఆంటీ ఐటెమ్ గీతం కూడా అంతే. హీరో ఎప్పుడూ సీరియ‌స్‌గానే ఉంటాడు. తను కామెడీ చేయ‌డానికి వీల్లేదు. ఢిల్లీ వ‌చ్చాక వినోదానికి స్కోప్ లేదు.కాబ‌ట్టి.. ఆ కామెడీ అంతా ఊర్లోనే చేయాల్సివ‌చ్చింది. సెకండాఫ్‌లో క‌బ‌డ్డీ కంటే.. అమ్మాయిల్ని వెదికి ప‌ట్టుకోవ‌డ‌మే పెద్ద టాస్క్ అయిపోయింది. అయితే అదైనా కాస్త క్రియేటీవ్ గా చేయాల్సింది. పోలీసుల స‌పోర్ట్ లేకుండా హీరో త‌న తెలివితేట‌ల‌తో అమ్మాయిల్ని ఎలా అన్వేషించాడ‌న్న‌ది ఆస‌క్తిక‌ర‌మైన అంశ‌మే. దాన్ని… థ్రిల్లింగ్ గా తీయ‌లేక‌పోయాడు. బోయ‌పాటి శ్రీ‌ను మార్క్ క్లైమాక్స్ తో శ‌త్రువు ఆట క‌ట్టించి – అమ్మాయిలతో ట్రోఫీ గెలిపించి – శుభం కార్డు వేశాడు. విల‌న్ పాత్ర‌ని ఈ సినిమాలో సంప‌త్ నంది చాలా క్రూరంగా చూపించాడు. తొలి స‌న్నివేశాల‌న్నీ ర‌క్త‌పాత మ‌య‌మే. ఒకే బుల్లెట్… న‌లుగురైదుగురు బుర్ర‌ల్లోంచి వెళ్లిపోయే షాట్స్‌… ఇప్ప‌టికీ ఎలా తీస్తారో అర్థం కాదు. ఈ విష‌యంలో సంప‌త్ బోయ‌పాటిని మించిపోయాడు

క‌బడ్డీ కోచ్‌గా గోపీచంద్ డీసెంట్ గానే చేశాడు. నిజానికి త‌న‌ది చాలా ఎగ్ర‌సీవ్ న‌ట‌న‌. అరుపులు, కేక‌లు ఉంటాయి. కానీ ఈసినిమాలో కాస్త కంట్రోల్ గానే డైలాగులు చెప్పాడు. త‌మ‌న్నాని హీరోయిన్ అన‌లేం. త‌ను తెలంగాణ యాస‌లో డైలాగులు చెబుతుంటే కొత్త‌గా అనిపించింది. రావు ర‌మేష్ పాత్ర బాగానే పేలింది. తొలి స‌గంలో త‌న‌దే ఎంట‌ర్‌టైనింగ్ పార్ట్. భూమిక భూమిక అంత‌గా లేదీ సినిమాలో. రెహ‌మాన్ ఓకే అనిపిస్తాడు.

టెక్నిక‌ల్ గా ఈ సినిమా గ్రాండ్‌గా క‌నిపించింది. మ‌ణిశ‌ర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్ల‌స్ అయ్యింది. బాలా రెడ్డి పాట థియేట‌ర్లో ఊపు తీసుకొస్తుంది. సంప‌త్ నంది డైలాగులు బాగానే రాసుకున్నాడు. `ఫెయిర్ అండ్ ల‌వ్ లీ వాడే అమ్మాయిలే ఫెయిర్ గా ఉండ‌డం లేదు. మెన్ష‌న్ హోస్ తాగే మ‌న‌మెందుకు మ‌నుషుల్లా ఉండాలి` లాంటి డైలాగులు బాగున్నాయి. రావు ర‌మేష్ పాత్ర వ‌ర‌కూ… సంప‌త్ డైలాగుల‌కు థియేట‌ర్లో మంచి స్పంద‌నే వ‌స్తుంది. అయితే క‌థ ప‌రంగా సంప‌త్ పూర్తిగా తేలిపోయాడు. క‌బ‌డ్డీ నేప‌థ్యం తీసుకున్నా.. అదే పాత చింత‌కాయ ప‌చ్చ‌డి లైన్ తో ముడి వేశాడు. అక్క‌డ‌క్క‌డ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఆక‌ట్టుకున్నా.. ఓవ‌రాల్ గా చూస్తే మాత్రం సిటీమార్ కొట్టించే ద‌మ్ము ఈ సినిమాకి లేద‌నిపిస్తుంది.

ఫినిషింగ్ ట‌చ్‌: సౌండ్ పొల్యూష‌న్‌

రేటింగ్: 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శెట్టి బలిజల్ని తిట్టి సారి చెప్పిన జూపూడి !

వైసీపీ నేతలకు కులాలతో ఎలా ఆటలాడుకోవాలో బాగా  స్టడీ చేసి గేమ్ ఆడుతున్నట్లుగా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా కొన్ని కులాలను కించపర్చడం .. ఆ తర్వాత అబ్బే అదేమీ లేదనడం పరిపాటిగా మారింది. అమలాపురంలో...

రివ్యూ: ఎఫ్‌3

F3 Telugu Movie Review తెలుగు360 రేటింగ్ : 3/5 న‌వ్వించే సినిమాలు ఎప్పుడో కానీ రావు. మేం న‌వ్విస్తాం అంటూ సినిమాలు తీసే ద‌ర్శ‌క‌నిర్మాత‌లే క‌రువ‌య్యారు. హీరోలు కూడా ఆ...

కేసీఆర్ చెప్పే ఆ సంచలనం అన్నాహజారేనేనా !?

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా సంచలనం సృష్టించాలనుకుంటున్న కేసీఆర్ ... తనచాయిస్‌గా అన్నా హజారానే నిలబెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్వయంగా మహారాష్ట్రలోని అన్నా హాజరే స్వగ్రామం రాలేగావ్...

టీడీపీ నేతలకు సజ్జల ఎన్‌కౌంటర్ బెదిరింపులు !

వైసీపీలో చేరకపోతే ఎన్ కౌంటర్ చేస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల బెదిరించారా ? అంటే అవుననే అంటున్నారు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఆయనను రెండున్నర నెలలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close