‘కుబేర’తో మరో సక్సెస్ కొట్టారు శేఖర్ కమ్ముల. ఈ సినిమా ఆర్థికంగానూ మంచి విజయాన్ని అందుకొంది. శేఖర్ కమ్ముల గత చిత్రాల కంటే బాక్సాఫీసు దగ్గర మిన్నగా స్కోర్ చేసింది. ధనుష్, నాగార్జునలతో బెస్ట్ పెర్ఫార్మెన్స్ రాబట్టుకొన్నారు శేఖర్. సినిమా లెంగ్త్ అనేది సమస్యగా మారినా, ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. అక్కడికీ శేఖర్ ఓ పాటని ట్రిమ్ చేసేశారు. ఈ సినిమాలో కొన్ని కొన్ని చోట్ల కొన్ని మెటాఫర్లు కనిపిస్తాయి. ముఖ్యంగా ‘వెంకటేశ్వరుడికి వజ్రపు హారం చేయిస్తా’ అనే డైలాగ్ లో చాలా లోతైన అర్థాలే వెదుక్కొన్నారు ప్రేక్షకులు. అసలు ఈ డైలాగ్ ఎందుకు రాయాల్సివచ్చింది? వెనుక ఉన్న మెటాఫర్ ఏమిటి? మొత్తంగా ఈ సినిమా శేఖర్ కమ్ములకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? ఈ సినిమాతో శేఖర్ నేర్చుకొన్న కొత్త పాఠాలేంటి? ఇవన్నీ తెలుగు 360కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకొన్నారు శేఖర్ కమ్ముల. ఆ ముఖాముఖిలోని హైలెట్స్ ఇవీ…
* ఈ సినిమా చూసి చిరంజీవి గారు చాలా మెచ్చుకొన్నారు. నాగార్జున, ధనుష్ ల నటన ఆయనకు బాగా నచ్చింది. చిరంజీవిగారితో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఈ సినిమాతో ఆయన్ని కూడా డీల్ చేయగలనన్న నమ్మకం కలిగింది.
* కుబేర నాకు చాలా సవాళ్లు విసిరింది. నాది కాని జోనర్ ఇది. స్టార్స్ తో పని చేయడం కూడా తొలి సారి. టీమ్ కూడా కొత్తది. ఇలాంటి జోనర్ కూడా టచ్ చేయలేదు, అందుకే ఈ విజయం చాలా సంతృప్తి ఇచ్చింది.
* మా అమ్మగారికి కూడా ఈ సినిమా బాగా నచ్చింది. ఇంకొంత సేపు ఉంటే బాగుణ్ణు అన్నారు.
* తమిళంలో ఎందుకు ఆడలేదో నాకు అర్థం కావడం లేదు. బహుశా ఈ సినిమాని వాళ్లు డబ్బింగ్ సినిమాలా చూశారేమో. పాన్ ఇండియా సినిమాలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో నాకు అర్థమైంది. మిగిలిన భాషల్లో విపరీతంగా పబ్లిసిటీ చేయాలి. సుకుమార్, రాజమౌళి లాంటి వాళ్లకే ఈ ఫీట్ సాధ్యమైంది.
* కుబేరలో..వెంకటేశ్వర స్వామికి వజ్రాల హారం చేయిస్తా అనే డైలాగ్ ఉంది. దేవుడ్ని మంచోడు, దుర్మార్గుడూ ఒకేలా ప్రార్థిస్తారు. ఎవరి కోరికలు వాళ్లవి. ఆ కోణంలోనే ఆ డైలాగ్ రాశా.
* వేటూరి గారు, సిరివెన్నెల గారు లేని లోటు చాలా స్పష్టంగా కనిపించింది. వాళ్లిద్దరూ లేకపోవడం నాకు రెండు చేతులూ పోయినట్టు అనిపించింది. వేటూరి గారు ఉంటే అన్ని పాటలూ ఆయనతోనే రాయించేవాడ్ని. భాస్కర భట్ల, చంద్రబోస్ కూడా మంచి పాటలు అందించారు.
* ఈ సినిమా చేస్తున్న ప్రోసెస్లో రోడ్డు మీద బిచ్చగాళ్లని చూసే కోణం నా వరకూ మారింది. `ఇలాంటి వాళ్లకు డబ్బులు ఇవ్వకూడదు` అని మన చుట్టు పక్కల వాళ్లు అంటుంటారు. కానీ మనం ఇచ్చేదాంతో వాడు మేడలూ మిద్దెలూ కట్టలేడు. మనకు పోయిందేం ఉండదు. రూపాయి ఇవ్వడం, ఇవ్వకపోవడం వెనుక అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదనిపించింది.
* సినిమా సినిమాకీ గ్యాప్ తీసుకోవడం నాకు అలవాటే. ఈసారి కూడా కొంత విరామం తీసుకొంటా. తరువాతి సినిమా ఏమిటన్నది ఇప్పుడే ఆలోచించలేదు. కథ కూడా ఏం అనుకోలేదు.
పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి