దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కంటే, ఆ పార్టీకి చెందిన ఒకే ఒక్క ఎంపీ సింఘ్వీ సూపర్ రిచ్. ఈ విషయం అఫిడవిట్‌తో తేలిపోయింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సింఘ్వీ , ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ. 2,860 కోట్లపైమాటే . మరోవైపు, కాంగ్రెస్ పార్టీ గతంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదికల ప్రకారం.. ఆ పార్టీ మొత్తం ఆస్తులు స్థిరాస్తులు, బ్యాంకు నిల్వలు అన్నీ కలిపి సుమారు రూ. 1,200 కోట్ల నుంచి రూ. 1,500 కోట్ల మధ్యలో ఉంటాయని అంచనా. అంటే, టెక్నికల్‌గా చూస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆస్తుల కంటే సింఘ్వీ కుటుంబ ఆస్తులే రెట్టింపు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీకి విరాళాల రూపంలో వచ్చే నగదుపై ఐటీ శాఖ ఆంక్షలు, కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఒకానొక దశలో పార్టీ ఖాతాల్లో నగదు నిల్వలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ, సింఘ్వీ ఆదాయం మాత్రం నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. గత ఐదేళ్లలోనే ఆయన సంపాదన రూ. 1,516 కోట్లు . అంటే సగటున ఏడాదికి ఆయన సంపాదన రూ. 300 కోట్లకు పైమాటే. ఈ సంపాదన ఆయన న్యాయవాద వృత్తి ద్వారా వచ్చింది.
కాంగ్రెస్ పార్టీకి ఆదాయం కూపన్లు, విరాళాల ద్వారా వస్తుంది. కానీ సింఘ్వీకి ఆదాయం కేవలం సుప్రీంకోర్టులో వాదనల ద్వారానే వస్తుంది. ఆయన ఒక్కో హాజరుకు రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు వసూలు చేస్తారని మార్కెట్ టాక్. అంటే పార్టీ కోట్లాది మంది కార్యకర్తలపై ఆధారపడితే, సింఘ్వీ మాత్రం తన వాక్చాతుర్యం మీద ఆధారపడి అంత సంపదను కూడబెట్టారు.
ప్రస్తుతం తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన, కేవలం తెలంగాణలోనే కాదు.. దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీలలో ఒకరిగా నిలిచారు. ఒక రాజకీయ పార్టీ తన ఎన్నికల ఖర్చుల కోసం దాతల వైపు చూస్తుంటే, అదే పార్టీకి చెందిన ఒక నేత మాత్రం తన వృత్తిపరమైన ప్రతిభతో పార్టీ నిధుల కంటే ఎక్కువ ఆస్తులను కలిగి ఉండటం భారత రాజకీయాల్లో ఒక వెరైటీ రికార్డు.


