ఒకప్పుడు ఎక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా, వాలిపోయి.. బాధిత కుటుంబ సభ్యుల తల నిమిరి, నేనున్నాను అంటూ భరోసా ఇచ్చిన జగన్ రెడ్డి ఇప్పుడు మాత్రం ప్రజల వద్దకు పోవడం లేదు. కల్తీ పాలు, బాణసంచా ప్రమాదాలు, డయేరియా వంటి ఘోర విషాదాలు జరుగుతున్నా.. ఆయన మాత్రం బెంగళూరు ప్యాలెస్కే పరిమితం అవుతున్నారు. పార్టీ నేతలను పరామర్శించే టైం ఉంది కానీ, సామాన్య ప్రజలను పట్టించుకునే తీరిక లేదా అని అందుకే షర్మిల ప్రశ్నించారు. కాస్త ఆలోచిస్తే.. నిజంగానే ఆయన ప్రజలపై అలిగారని అనిపించడం సహజం.
ప్రజలపై అలిగితే ఎవరికి నష్టం?
చెరువుపై అలిగి కడుక్కోకపోతే.. నష్టం నీకే కానీ చెరువుకు కాదు అన్న సామెత జగన్ కి సరిగ్గా సరిపోతుంది. ప్రతిపక్ష హోదా కోసం కోర్టులను ఆశ్రయించి.. స్పీకర్ పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్న ఆయన తనకు ఈ పరిస్థితి రావడానికి ప్రజలే కారణం అని వారిపై అలక బూనినట్లుగా కనిపిస్తోంది. అసెంబ్లీకి వెళ్లనని భీష్మించుకుని కూర్చోవడం, కనీసం బాధలో ఉన్న ప్రజలను పలకరించకపోవడం చూస్తుంటే.. ఆయన ప్రజలారా.. మీరు నన్ను ఓడించారు కాబట్టి, నేను మీ దగ్గరికి రాను అని ఒక రకమైన సైలెంట్ వార్ ప్రకటించినట్లు అయింది.
ప్రతిపక్ష హోదా అడుక్కునే స్థితి
నాడు 151 సీట్లతో వెలిగిన నాయకుడు, నేడు 11 సీట్లకు పడిపోయి.. కనీసం మాట్లాడే అవకాశం కోసం, ప్రతిపక్ష హోదా కోసం ప్రాధేయపడాల్సిన పరిస్థితి రావడం నిజంగా రాజకీయ విచిత్రమే. అసెంబ్లీలో మైక్ దొరకదని సభకు వెళ్లడం మానేసిన జగన్, బయట జనాల్లోకి వెళ్లడానికి కూడా అడ్డంకులు వెతుక్కుంటున్నారు. ఆయనకు కేవలం అధికారం ఉన్నప్పుడే ప్రజలు కనిపిస్తారని ఓడిపోయిన బాధలో నా దగ్గరికే అందరూ రావాలి.. నేనెవరి దగ్గరికీ వెళ్లను అన్న అహంతో ఉన్నారని ఎవరైనా అనుకుంటే అందులో తప్పేమీ లేదు.
జగన్ మార్చుకోవాల్సిన మనస్తత్వం
జగన్ ప్రజలతో ఈ దూరం ఇలాగే కొనసాగితే మాత్రం వైసీపీ రాజకీయ పునరుజ్జీవం అసాధ్యం. పాదయాత్రలతో అధికార పీఠాన్ని అందుకున్న నేత ఇప్పుడు ప్యాలెస్ గోడల మధ్యే ఉండిపోవడం ఆయన రాజకీయ భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు కావచ్చు. కానీ మూడేళ్ల పాటు బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమవుతానని చివరి రెండేళ్లు మాత్రమే ప్రజల్లో ఉంటానని ఆయన గతంలోనే చెప్పారు. అందుకే ఆయన అలకపాన్పు మరో ఏడాది వరకూ సాగే అవకాశం ఉంది.
