మొంథా తుఫాను వల్ల పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారుల కంటే వేగంగా అంచనా వేసిన మాజీ సీఎం జగన్ రెడ్డి..వారిని పరామర్శించాల్సిన అవసరం లేదనుకుని బెంగళూరుకు వెళ్లిపోయారు. కానీ షర్మిల మాత్రం అలా అనుకోలేదు. ప్రెస్ మీట్లు పెట్టడం కన్నా నేరుగా జనాల్లోకి వెళ్తే మంచిదని చెప్పి.. ఆమె రంగంలోకి దిగిపోయారు. కృష్ణా జిల్లా బంటుమల్లిలో పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించారు.
రైతులతో మాట్లాడి వారి బాధలను తెలుసుకున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఓ ప్రతిపక్ష పార్టీ ఎలా చేయాలో అలా చేశారు. ఇప్పుడు అందరూ షర్మిల రాజకీయంతో జగన్ రాజకీయాన్ని పోలుస్తున్నారు. నలభై శాతం ఓటు బ్యాంకు ఉందని చెప్పుకునే జగన్ రెడ్డి వారి కోసం కూడా కనీసం పరామర్శకు రావడం లేదు. సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఉన్న టైమింగ్స్ లా..రాజకీయం చేస్తున్నారు. వారానికి మూడు రోజులు.. అందులో రెండు రోజులు రాకపోకలకు కేటాయిస్తున్నారు.
తనను ఓడించిన వారి కోసం తాను పని చేయాల్సిన పని లేదని జగన్ అనుకుంటున్నారన్న బావన ఉంది. అయితే ప్రజాస్వామ్యంలో ప్రజలపై అలగడం అంటే చెరువుపై అలగడం లాంటిదేనని అనుకోవచ్చు. జగన్ అలాగే చేస్తున్నారు. కొద్ది రోజులు ఇదే తరహా రాజకీయం చేస్తే జగన్ కన్నా షర్మిల నయం అని వైసీపీ పార్టీ క్యాడర్ కూడా అనుకునే పరిస్థితి రావొచ్చు.
