శిల్పా విష‌యాన్ని సీఎం స‌రిగానే డీల్ చేశారా..?

ఊహించిన‌ట్టుగానే తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టేందుకు శిల్పా మోహ‌న్ రెడ్డి డిసైడ్ అయ్యారు. నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో పార్టీ నుంచి సీటు ఆశించిన శిల్పా… ఇప్పుడు వైకాపాలో చేరుతున్న అనూహ్యంగా ప్ర‌క‌టించ‌డం టీడీపీ వ‌ర్గాల‌కు ఒక‌ర‌కంగా షాక్ అనే చెప్పాలి. నిజానికి, నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ సీటు కోసం భూమా అఖిల వ‌ర్గంతోపాటు, శిల్పా వ‌ర్గం కూడా పోటి ప‌డిన సంగ‌తి తెలిసిందే. శిల్పాకే సీటు అన్న‌ట్టుగా మొద‌ట్నుంచీ సంకేతాలు ఇస్తూ వ‌చ్చింది టీడీపీ. అయితే, క్షేత్ర‌స్థాయిలో మాత్రం అఖిల ప్రియ వ‌ర్గం దూకుడు ధోర‌ణితోపాటు, టిక్కెట్టు కేటాయింపుపై చంద్ర‌బాబు నాయుడు నాన్చివేత వైఖ‌రి కూడా తోడు కావ‌డంతో.. పార్టీకి శిల్పా గుడ్ బై చెప్పేశారు. వైకాపా నుంచి త‌న‌కు ఎలాంటి హామీ రాలేద‌నీ, టీడీపీకి మూడేళ్ల‌పాటు సేవ చేశాన‌నీ, అయినా త‌న‌కీ కార్య‌క‌ర్త‌ల‌కీ పార్టీలో స‌రైన గౌర‌వం ద‌క్క‌డం లేద‌న్న ఉద్దేశంతోనే పార్టీ వీడుతున్న‌ట్టు శిల్పా చెప్పారు. అయితే, ఈ సంద‌ర్భంలో టీడీపీ నాయ‌కుల్లో ఓ కొత్త చ‌ర్చ ప్రారంభ‌మైన‌ట్టు తెలుస్తోంది.

పార్టీ గురించి చంద్ర‌బాబు నాయుడు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌నీ, ఆయ‌న వైఖ‌రి వ‌ల్ల‌నే శిల్పా వెళ్లిపోయార‌నీ, ఇది ఇక్క‌డితో ఆగక‌పోవ‌చ్చ‌నే ఆందోళ‌న కొంత‌మంది నేత‌ల్లో వ్య‌క్త‌మౌతోంది. అమెరికా నుంచి వ‌చ్చిన వెంట‌నే అభ్య‌ర్థి విష‌యంలో ఒక ప్ర‌క‌ట‌న చేసి ఉంటే ప‌రిస్థితి ఇక్క‌డి వ‌ర‌కూ వ‌చ్చేది కాద‌ని సీనియ‌ర్లు అంటున్నారు! అంతేకాదు, పార్టీ కోసం ఎంతో స‌మ‌యం కేటాయిస్తున్నా అని చెబుతున్న చంద్ర‌బాబు.. ఈ మ‌ధ్య కాలంలో తీసుకుంటున్న నిర్ణ‌యాలు అర్థం కావ‌డం లేద‌ని వారు అంటున్నారు. పార్టీకి సంబంధించిన కీల‌క అంశాల‌ను పెండింగుల్లో పెట్టేస్తున్నార‌ని అభిప్రాయ‌డుతున్నారు. నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో ఇంత‌వ‌ర‌కూ ఏదీ తేల్చ‌లేదు. గ‌వ‌ర్న‌ర్ కోటాలో వ‌చ్చే ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను కూడా ఇంతవ‌ర‌కూ ఎంపిక చెయ్య‌లేదు. జిల్లా పార్టీ అధ్య‌క్ష ప‌దువుల్ని కూడా ఇంకా ఖ‌రారు చెయ్య‌లేదు. కీల‌క‌మైన అంశాల‌న్నీ ఇలా ఎక్క‌డివి అక్క‌డే ఉన్నాయ‌నీ, చంద్ర‌బాబు నాన్చుడు ధోర‌ణి ఏమిటో అర్థం కాలేదంటూ పార్టీ వ‌ర్గాలు బ‌హిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి.

నిజానికి, మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త‌రువాత కొంత‌మంది టీడీపీ నేత‌ల్లో అసంతృప్తి వ్య‌క్త‌మైన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్నుంచే ప‌రిస్థితి గాడి త‌ప్పింద‌నీ, ఇప్ప‌టికీ కొంత‌మంది నేత‌ల్లో అసంతృప్తి అలానే ఉంద‌నే చ‌ర్చ కూడా పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. పార్టీకి సంబంధించిన విష‌యాల్లో చంద్ర‌బాబు ధోర‌ణి ఇలానే కొన‌సాగితే ఇబ్బందిక‌రంగా మారే అవ‌కాశం ఉంద‌న్న కామెంట్స్ వినిపిస్తున్నాయి! శిల్పా మోహ‌న్ రెడ్డి పార్టీ వీడ‌టాన్ని చంద్ర‌బాబు లైట్ గా తీసుకుంటున్నార‌నీ, కానీ ఇలాంటివి ఇక్క‌డితో ఆగాలంటే పార్టీ గురించి చంద్ర‌బాబు చాలా ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌నే అభిప్రాయాన్ని సీనియ‌ర్లు వ్య‌క్తం చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక విష‌యంలో చంద్ర‌బాబు స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌నీ, అభ్య‌ర్థిని ముందే ఖ‌రారు చేసి ఉంటే ప‌రిస్థితి చ‌క్క‌బ‌డేద‌నీ, తాజా ప‌రిస్థితికి ఆయ‌న స్వ‌యంకృత‌మే కార‌ణ‌మ‌ని వారు విశ్లేషిస్తున్నారు. పార్టీ వ‌ర్గాల నుంచి వ్య‌క్త‌మౌతున్న ఈ విశ్లేష‌ణ‌లూ స‌ల‌హాలూ చంద్ర‌బాబు దృష్టికి వెళ్లాక, ఆయ‌న ధోర‌ణిలో ఏదైనా మార్పు ఉంటుందేమో అని ఆశిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.