శిల్పాతో ప్ర‌తిప‌క్షంలోకి వ‌ర‌ద మొద‌ల‌వుతుందా?

చాలా కాలం త‌ర‌వాత‌.. చంద్ర‌బాబు నాయుడు తీరుపై బ‌హిరంగ అసంతృప్తి వెల్ల‌డైంది. అదీ శిల్పా మోహ‌న‌రెడ్డి రూపంలో. తాను టీడీపీలో ఉన్నా త‌న ఇంట్లో ఉన్న‌ది వైయ‌స్ఆర్ ఫొటోయేన‌ని ఆయ‌న చెప్పిన విధానం దేనికి సంకేతం. అధికార పార్టీలో ఉన్న‌వారు ప్ర‌తిప‌క్షం వారి ఫొటోలు ఇంట్లో పెట్టుకుంటార‌ని చెప్ప‌డం కొంచెం అతిశ‌యోక్తిగా అనిపించ‌వ‌చ్చు. చెప్పిన వాడికి మాత్రం ఎప్ప‌టికైనా ఉప‌యోగిస్తుంది అనుకున్నారేమో అనుమాన‌మే. నంద్యాల అసెంబ్లీ సీటు వివాదం మాత్రం బ‌ల‌మైన వ‌ర్గాన్ని టీడీపీకి దూరం చేసింది. ఎంత‌మంది కార్య‌క‌ర్త‌లు వెళ్ళారు.. ఎంత‌మంది గుంభ‌నంగా ఉన్నారు..అనే అంశాలు ఇక్క‌డ ప్ర‌ధానం.

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాన‌ని చెప్పిన శిల్పా మోహ‌న‌రెడ్డి..వ్యాఖ్య‌లు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్ర‌తిప‌క్షం నుంచి అధికార‌ప‌క్షంలోకి ఫిరాయించిన వారి ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంద‌న్న వ్యాఖ్య‌లు కొత్త ప‌రిణామాల‌కు సూచిక‌లా అనిపిపిస్తున్నాయి. మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌నో.. మ‌రేదో ప‌ద‌విని క‌ట్ట‌బెడ‌తామ‌నో..బెదిరించో..బుజ్జ‌గించో విప‌క్ష శాస‌న స‌భ్యుల్నిత‌న పంచ‌న చేర్చుకున్నారు టీడీపీ అధినేత‌. ఉదాహ‌ర‌ణ‌కు జ‌గ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూనే తీసుకుందాం. ఆయ‌న పెద్ద‌ప‌ద‌వే వ‌స్తుంద‌న్న ఆశ‌తో వెళ్ళారు. ఊరించి, ఊరించి చేసిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో న‌లుగురికి త‌ప్ప బెర్త్‌లు చిక్క‌లేదు. 25 మందికి పైగా వ‌చ్చిన ఎమ్మెల్యేలలో కొంద‌రి ఫిరాయింపులకు కార‌ణం వేరు. అలాంటి వారిని ప‌క్క‌న బెడితే హామీ ఇచ్చిన వారికీ అవి నెర‌వేర‌లేదు. అనిత‌-రోజా మ‌ధ్య వివాదంలో పోడియంలోకి వెళ్ళి ఆందోళ‌న చేసిన వారిలో జ్యోతుల నెహ్రూ కూడా ఉన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు ఎక్క‌డా అనుమానం రానీయ‌కుండా చ‌ల్ల‌గా వ్య‌వ‌హ‌రించారు. తీరా అక్క‌డికెళ్ళిన త‌ర‌వాత ప్ర‌తిప‌క్ష నేత‌నూ, ముద్ర‌గ‌డ‌ను విమ‌ర్శించ‌డానికి ఉప‌యోగించుకున్నారు మిన‌హా ఒరిగింది శూన్యం. జ్యోతుల రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైందే టీడీపీలో.. ఫిరాయించిన‌ప్పటికీ ఆయ‌న‌కే న్యాయం జ‌ర‌గ‌లేదంటే..మిగిలిన వారి గురించి, ఆలోచించ‌డం అన‌వ‌స‌రం. భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం ఆయ‌న కుమార్తెకు ప‌ద‌వి తెచ్చిపెట్టింది. రాయ‌ల‌సీమ నుంచి వ‌చ్చిన వారికే ప‌ద‌వులివ్వ‌డం వెనుక చంద్ర‌బాబు ఆలోచ‌న సుస్ప‌ష్టం. జ‌గ‌న్ బ‌లంగా ఉన్న రాయ‌ల‌సీమ‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ను దెబ్బ‌కొట్ట‌డం. ఎంత ప్ర‌య‌త్నించినా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఎంత‌గా ప్ర‌య‌త్నించినా ప్ర‌భావితం చేయ‌లేక‌పోయారు.

ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన చోట ఆధిప‌త్యం దెబ్బ‌తిని పార్టీ శ్రేణులు నిరాస‌క్తంగానో.. అసంతృప్తితోనో ఉన్నారు. గొట్టిపాటి ర‌వికుమార్ మాతృపార్టీలో ప్ర‌వేశించ‌డంతో క‌ర‌ణం బ‌ల‌రాం ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. బాహాబాహీకి దిగినంత ప‌నైంది. ఇలా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఏదో ఒక గ‌డ‌బిడ ఉంది. కొన్ని బ‌య‌ట‌ప‌డ్డాయి. కొన్ని ప‌డ‌లేదు. అంతే. విశాఖ‌లోనే చూసుకుంటే మంత్రుల మ‌ధ్య ప‌డక. వీరికి తోడు ఓ విద్యావేత్త ప్ర‌భావ‌మూ ఉంది. అక్క‌డే భూకుంభ‌కోణం చోటుచేసుకుంది. ప్ర‌స్తుతం అది పార్టీని కుదిపేస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏదైనా సాధ్య‌మే. జ‌గ‌న్ అంగీక‌రిస్తే వెన‌క్కి రావ‌డానికి కొంద‌రు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తం మీద శిల్పా మోహ‌న్ రెడ్డి ఎంట్రీ మ‌రిన్ని సంచ‌ల‌నాల‌కు తావిస్తుందా.. నంద్యాల‌కే ప‌రిమిత‌మ‌వుతుందా తేల‌డానికి కొన్ని రోజులు ఆగాల్సిందే.
-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.