‘నిన్ను కోరి’ సినిమాతో దర్శకుడిగా అడుగు పెట్టాడు శివ నిర్వాణ. ఆ సినిమా హిట్టయ్యింది. ఆ తరవాత నాగచైతన్యతో మజిలీ చేశాడు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకొంది. ఈ కాంబోలో మరో సినిమా వస్తుందని అంతా అనుకొన్నారు. కానీ కుదర్లేదు. ఈలోగా టక్ జగదీష్, ఖుషి సినిమాలు చేశాడు శివ నిర్వాణ. అవి ఆశించిన ఫలితాల్ని ఇవ్వలేదు. ఇప్పుడు రవితేజతో ‘ఇరుముడి’ అనే సినిమాని పట్టాలెక్కించాడు. షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతోంది.
నిజానికి ఈ కథ ముందు నాగచైతన్య దగ్గరకు వెళ్లింది. చైతూకి కూడా ఈ కథ బాగా నచ్చింది. కానీ… తన నిర్ణయం చెప్పడానికి చాలా సమయం తీసుకొన్నాడు. చైతూ కోసం శివ నిర్వాణ కూడా చాలా కాలం ఎదురు చూశాడు. ప్రాజెక్ట్ ఆలస్యమైపోతుండడం, మరోవైపు.. మైత్రీ మూవీస్ సంస్థ కూడా హీరో విషయంలో తొందరపడుతుండడం, అప్పటికే మైత్రీ మూవీస్ రవితేజకు అడ్వాన్స్ ఇచ్చి ఉండడం వల్ల… ఈ కథని రవితేజకు వినిపించాల్సివచ్చింది. రవితేజ ఈ కథని ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చేసేయడంతో… సినిమాని పట్టాలెక్కించలేక తప్పలేదు. చైతూ గనుక త్వరిత గతిన నిర్ణయం తీసుకొంటే, ఈ కథ రవితేజ వరకూ వెళ్లి ఉండేది కాదు. సినిమా చేయాలా, వద్దా? అనే విషయంలో రవితేజ చాలా వేగంగా నిర్ణయాలు తీసుకొంటుంటాడు. అదే ఇప్పుడు కలిసొచ్చింది. ఈ కథని వదిలేసి నాగచైతన్య తప్పు చేశాడా, లేదా? అనేది `ఇరుముడి` రిజల్ట్ వచ్చాకే తేలుతుంది.

