రామ్ చరణ్ సినిమా `పెద్ది`పై హైప్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ‘చికిరి’ పాటతో… ఆ క్రేజ్ రెట్టింపు అయ్యింది. ఈ పాటలో చరణ్ గ్రేస్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకొంటోంది. రీల్స్ రూపంలో సోషల్ మీడియా అంతా హల్ చల్ చేస్తోంది. డిసెంబరులో పెద్ది నుంచి మరో పాట రాబోతోందట. ఇది.. చరణ్ క్యారెక్టరైజేషన్ ని తెలిపే పాట అని, ఇందులోనూ స్టెప్పులు అదిరిపోతాయని ఇన్ సైడ్ వర్గాల టాక్.
ఇప్పుడు ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో సీనియర్ నటి శోభన ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. చిరంజీవి – శోభనలది విజయవంతమైన జోడీ. ‘రుద్రవీణ’, ‘రౌడీ అల్లుడు’ చిత్రాల్లో కలిసి నటించారు. `చిలుకా క్షేమమా..` అనే పాటని చిరు అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. చిరుకి శోభన అంటే ప్రత్యేకమైన అభిమానం కూడా. ఇప్పుడు చరణ్ సినిమాలో ఆమె ఓ కీలక పాత్ర పోషించడం కచ్చితంగా అదనపు ఆకర్షణ అవుతుంది. ఈ పాత్ర కోసం బుచ్చిబాబు చాలా ఆప్షన్లు ఆలోచించాడట. ఒకప్పుడు మెగాస్టార్ తో ఆడిన పాడిన కథానాయికల లిస్టు తయారు చేసి, అందులో శోభన పేరుని ఫైనలైజ్ చేశాడని టాక్. శోభనకు ఇది వరకు కూడా ఇలాంటి అవకాశాలు చాలా వచ్చాయి. కానీ ఆమె వాటిని తిరస్కరించారు. ఇటీవల మోహన్ లాల్ తో కలిసి ఓ మలయాళ చిత్రంలో నటించారు శోభన. ఆ చిత్రంలో శోభన నటనకు గానూ మంచి గుర్తింపు లభించింది. అయితే శోభన ఓ తెలుగు చిత్రంలో నటించడం చాలా కాలం తరవాత ఇదే మొదటి సారి. ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది? ఆ విశేషాలేంటి? అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.


