ఓ హీరో కోసం మరో హీరో గొంతు సవరించుకోవడం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న సాయిధరమ్ తేజ్ కోసం ధనుష్, శింబులు చెరో పాట పాడేశారు. ఇలాంటి సంప్రదాయమే హీరోయిన్లలోనూ మొదలైంది. శ్రుతిహాసన్‌లో మంచి సింగర్ ఉన్న సంగతి తెలిసిందే. తన సినిమాల్లో తరచూ పాటలు పాడుకొంటుంటోంది శ్రుతి. ఇప్పుడు మరో హీరోయిన్ కోసం గొంతు సవరించుకొంటోంది. విశాల్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ఒక్కడొచ్చాడు. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయిక. ఈ సినిమాలోని ఓ పాటని శ్రుతిహాసన్‌తో పాడించాలని డిసైడ్ అయ్యారట. తన కోసం కాకుండా మరో కథానాయిక కోసం శ్రుతి పాట పాడడం ఇదే తొలిసారి. త్వరలోనే ఈ పాటని రికార్డ్ చేయబోతురన్నారు. హిప్ ఆప్ తమిళ్ ఇచ్చిన ట్యూన్‌కి డా.భాగ్యలక్ష్మి సాహిత్యం అందించారు. అక్టోబరు 9న పాటల్ని విడుదల చేస్తారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ ”విశాల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ. యాక్షన్, ఎంటర్టైన్మెంట్.. అన్నీ కుదిరాయి. సెప్టెంబర్ 3 నుండి రష్యాలో బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో పాటలు చిత్రీకరిస్తాం. ఆగస్ట్ 29 విశాల్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ని రిలీజ్ చేస్తాం” అన్నారు. తెలుగులోనే కాదు, తమిళంలోనూ వరుస ఫ్లాపులతో తల్లడిల్లిపోతున్నాడు విశాల్. పందెం కోడి తరవాత ఆ స్థాయి హిట్టు కొట్టలేదు. మళ్లీ పందెం కోడి కాంబినేషనే.. అలాంటి హిట్టు ఇస్తుందేమో చూడాలి.