సంగారెడ్డి జిల్లా భానురులోని సిగాచీ ఇండస్ట్రీస్ యూనిట్లో జరిగిన భారీ పేలుడు ఘటనలో ఎట్టకేలకు ఆ సంస్థ ఉన్నతాధికారులపై చట్టపరమైన చర్యలు మొదలయ్యాయి. ఈ కేసులో ఆరు నెలల ర్వాత సీఈఓను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సంస్థ సీఈఓ అమిత్ రాజ్ ను బీడీఎల్ భానురు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జూన్ నెలలో జరిగిన ఈ ప్రమాదంపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న యంత్రాంగం, హైకోర్టు తీవ్రస్థాయిలో మందలించడంతో ఒక్కసారిగా వేగం పెంచింది.
జూన్ నెలలో భానురులోని సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 54 మంది చనిపోయారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక విపత్తుల్లో ఒకటిగా నిలిచింది. పేలుడు ధాటికి మూడంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. లోపల పని చేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. చనిపోయినారిలో 8 మంది ఆచూకీ నేటికీ లభించలేదు. ఈ కేసులో ఆరు నెలల పాటు ఎటువంటి అరెస్టులు జరగకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఈ ప్రమాదంలో చనిపోయినంత మాత్రాన, యాజమాన్యంలోని ఇతరులను ఎలా వదిలేస్తారని హైకోర్టు కోర్టు పోలీసులను నిలదీసింది. విచారణాధికారి స్వయంగా కోర్టుకు హాజరు కావాలని, ఇన్వెస్టిగేషన్లో పురోగతి లేకపోతే కోర్టు పర్యవేక్షణలోనే విచారణ జరిపిస్తామని హెచ్చరించింది. ఈ ఒత్తిడితోనే పోలీసులు సీఈఓ అరెస్టుకు సిద్ధమయ్యారు. బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందేలా చూడాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తేవాలని హైకోర్టు ఆదేశించింది. బాధితులకు పరిహారం పూర్తి స్థాయిలో అందలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.