సింగర్ చిన్మయి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు. తనను ఆన్లైన్లో వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు.
అసలు వివాదంలోకి వెళ్తే… చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ప్రమోషన్స్ సందర్భంగా “మంగళసూత్రం ధరించడం వ్యక్తిగత ఎంపిక కావాలి” అని వ్యాఖ్యానించారు. “నాకు పెళ్లి అయిన తర్వాత మంగళసూత్రం మెడలో వేసుకోవాలా వద్దా అనేది నీ నిర్ణయమే అని నా భార్యకి చెప్పాను. నేనైతే తాళి వేసుకోవద్దనే చెబుతాను. పెళ్లి తర్వాత అమ్మాయిలకు తాళిబొట్టు ఉంటే, అబ్బాయిలకు ఏం ఉండదు. ఇది అమ్మాయిలకే ఎందుకు? ఇది వివక్షే” అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
ఈ వ్యాఖ్యల తర్వాత చిన్మయిపై కూడా ట్రోల్స్ దాడి మొదలయ్యాయి. ఆమెను అవమానించే కామెంట్లతో సోషల్ మీడియాను నింపేశారు. దీనిపై చిన్మయి న్యాయపోరాటానికి దిగారు. ఇలాంటి వివాదాలు, కేసులు చిన్మయికి కొత్తకావు. ఆమె ఫైర్ బ్రాండ్. మీటూ ఉద్యమం సమయంలో తమిళనాడులో పలువురు సెలబ్రిటీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ సమయంలో ఎన్నో ఒత్తిడులు, బెదిరింపులు ఎదుర్కొన్నప్పటికీ వెనక్కి తగ్గలేదు. ఇప్పటికీ ఆమె పోరాటం కొనసాగుతోంది.
తాజాగా కేసు నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, కొరకరాని కొయ్యగా మారిన ఆన్లైన్ అబ్యూస్‌కి ఎలాంటి అడ్డుకట్ట వేస్తారో చూడాలి.