ఓ భారీ స్కాంలో తన పేరు బయటకు రావడంతో సింగర్ మంగ్లీ హడావుడి చేస్తున్నారు. ఎదురు ఫిర్యాదులు చేయడమే కాదు.. పోలీసు ఉన్నతాధికారుల్ని కలిసి ఫోటోలు విడుదల చేస్తున్నారు. ఆమె తీరు చూస్తూంటే.. గుమ్మడికాయల దొంగ అంట భుజాలు తడుముకుంటున్నట్లుగా ఉందన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. సింగర్‌గా గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు ఏకంగా కోట్లాది రూపాయల ఆర్థిక మోసం, వసూళ్లు ఆరోపణల సుడిగుండంలో చిక్కుకోవడం చర్చనీయాంశమైంది.
కోట్ల మోసం ఆరోపణలు
సింగపోగు సుబ్బు అనే న్యాయవాది మంగ్లీపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 100 నుండి 150 మంది అమాయకులను మైక్రోఫైనాన్స్ , ఫిల్మ్ ఫైనాన్సింగ్ పేరుతో నమ్మించి కోట్లమేర మంగ్లీ, ఆమె సోదరుడు శివ , మరికొందరు కలిసి మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఇన్వెస్టర్లకు రావాల్సిన అసలు, వడ్డీ ఇవ్వకుండా ఎగ్గొట్టడమే కాకుండా, అడిగిన వారిని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ భారీ స్కామ్‌లో మంగ్లీ పేరు ప్రముఖంగా వినిపించడం సంచలనం సృష్టించింది.
ఆరోపణలు వచ్చిన వెంటనే మంగ్లీ రివర్స్ కేసు
తనపై ఆరోపణలు వచ్చిన మరుసటి రోజే మంగ్లీ రంగంలోకి దిగారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు సదరు న్యాయవాది ప్రయత్నిస్తున్నారని, సోషల్ మీడియాలో తనపై ఉన్న వీడియోలు తొలగించడానికి ఆయన రూ.10 లక్షలు డిమాండ్ చేశారని ఆమె ఎదురు ఫిర్యాదు చేశారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని, వేధింపులకు గురిచేశారని పేర్కొంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.
ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు
కేసు నమోదైనప్పటి నుండి మంగ్లీ తీరు విచిత్రంగా ఉంది. క్షేత్రస్థాయిలో పోలీసుల విచారణకు సహకరించాల్సింది పోయి, నేరుగా డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లను కలిసి ఫిర్యాదులు చేయడం, వారితో దిగిన ఫోటోలను బయటపెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. దిగువ స్థాయి అధికారులు తనపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు, తనకు పైస్థాయిలో బలమైన మద్దతు ఉందని చెప్పుకునేందుకే ఆమె ఇలా చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. నిజంగా ఆమెకు సంబంధం లేకపోతే, విచారణలో నిగ్గు తేలే వరకు ఆగకుండా ఇలా ప్రతిరోజూ హడావుడి చేయాల్సిన అవసరం ఏమిటనేది సామాన్య జనం నుంచి వస్తున్న ప్రశ్న.
తప్పు చేయకపోతే భయమెందుకు?
ఒకవేళ ఆమెకు తెలియకుండానే ఇదంతా జరిగితే, ఆ విషయాన్ని పోలీసులకు వివరించి నిరూపించుకోవాలి. అలా కాకుండా, ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి ఫోటోలు దిగుతూ వ్యవస్థను ధిక్కరించేలా వ్యవహరించడం ఆమెపై అనుమానాలను మరింత పెంచుతోంది. అవినీతి ,మోసం ఆరోపణలు వచ్చినప్పుడు సెలబ్రిటీలు వ్యవస్థను గౌరవించాలి తప్ప, వ్యవస్థను ప్రభావితం చేసేలా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆమె నిజంగా బాధితురాలా లేక ఈ ఆర్థిక మోసంలో భాగస్వామ్యా? అనేది పోలీసుల నిష్పాక్షిక విచారణలో తేలాల్సి ఉంది. ఇందులో రాజకీయం లేదు కాబట్టి పోలీసులు తేలుస్తారు. కానీ, ఈ లోపే ఆమె చేస్తున్న హడావుడి మాత్రం బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా అన్న ఆందోళనను కలిగిస్తోంది.
