రాజకీయాల్లో మూడు రాజధానుల కాన్సెప్ట్ ఫెయిల్ అయినా, ప్యాలెస్‌ల విషయంలో మాత్రం జగన్ రెడ్డి మూడు ప్యాలెస్‌ల ఫార్ములాను పక్కాగా అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు బెంగళూరు యలహంక ప్యాలెస్ , తాడేపల్లి ప్యాలెస్‌ల మధ్యే షటిల్ సర్వీస్ నడుపుతున్న ఆయన, ఇప్పుడు లోటస్ పాండ్‌కు కూడా పూర్వ వైభవం తీసుకురావాలని డిసైడ్ అయ్యారట.
మూడు ప్యాలెస్లకూ జగన్ రెడ్డి సమన్యాయం!
ఒకప్పుడు ఏపీకి మూడు రాజధానులు కావాలని పట్టుబట్టిన జగన్ రెడ్డి , ఇప్పుడు తనకు ఉన్న మూడు ప్యాలెస్‌లకు సమన్యాయం చేసే పనిలో పడ్డారు. వారం మొత్తంలో నాలుగురోజులు బెంగళూరు చల్లగాలిలో, మూడు రోజులు తాడేపల్లి ఏకాంతంలోనో గడిపేస్తే హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్ ఏమైపోవాలి? అందుకే, వారం మొత్తాన్ని మూడు భాగాలుగా విభజించి.. బెంగళూరుకు వందనం, తాడేపల్లికి అభివందనం, లోటస్ పాండ్‌కు మంగళహారతి ఇచ్చేలా షెడ్యూల్ మార్చుకుంటున్నారట. రాజధానులు మార్చలేకపోయినా, తన మకామును మాత్రం మూడు నగరాల మధ్య తిప్పుతూ మావిగన్ రాజకీయాలకు తెరలేపారు.
లోటస్ పాండ్‌కు మళ్లీ లక్కు..
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బెంగళూరు యలహంక ప్యాలెస్‌నే తన శాశ్వత నివాసంగా మార్చుకున్న జగన్, ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ లోటస్ పాండ్ వైపు చూపు సారిస్తున్నారు. బహుశా బీఆర్ఎస్ నేతలతో టచ్‌లో ఉండటానికో లేక తన చెల్లి షర్మిలమ్మ అక్కడే ఉంటుందని గుర్తుకొచ్చో కానీ, వీకెండ్స్‌లో లోటస్ పాండ్‌లో మకాం వేయాలని భావిస్తున్నారట. ఏదేమైనా ఆ ప్యాలెస్ గోడలకు మళ్లీ రాజకీయ వ్యూహాల గుసగుసలు వినిపించబోతున్నాయని తాజా సమాచారం.
పులివెందుల.. కేవలం వర్థంతులకేనా?
మరోవైపు పులివెందులలో అంతంత ఖర్చు పెట్టి కట్టుకున్న ప్యాలెస్ పరిస్థితి ఏమిటని కొందరు సెటైర్లు వేస్తున్నారు. వైఎస్సార్ జయంతి, వర్థంతి వంటి ఫంక్షన్లకు తప్ప మరెప్పుడూ అటువైపు వెళ్లని జగన్ రెడ్డి, బహుశా దాన్ని తన హాలిడే హోమ్ గా డిక్లేర్ చేశారేమో అని జోకులు వినిపిస్తున్నాయి. పులివెందుల ప్రజల కంటే తన బెంగళూరు విల్లాకే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం చూస్తుంటే, ఆయన ప్రేమ రాష్ట్రాల సరిహద్దులు దాటిపోయిందని అర్థమవుతోంది.
ప్యాలెస్ పిచ్చా.. రాజకీయ వ్యూహమా?
వారంలో మూడు రోజులు బెంగళూరు, రెండు రోజులు తాడేపల్లి, రెండు రోజులు హైదరాబాద్ లోటస్ పాండ్..ఇక నుంచి ఇదే షెడ్యూల్ కావొచ్చు. ఈ షెడ్యూల్ చూస్తుంటే ఇది రాజకీయ పార్టీ కార్యక్రమంలా కాకుండా ప్యాలెస్ దర్శిని యాత్రలా కనిపిస్తోంది. అసలు పార్టీ కార్యకర్తలకు ఎక్కడ దొరుకుతారు అంటే ఈరోజు ఏ ప్యాలెస్‌లో ఉన్నారో కనుక్కోవాలి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ప్రజలకు అందుబాటులో ఉండటం కంటే, తన ప్యాలెస్‌లకు అన్యాయం జరగకుండా చూసుకోవడమే లక్ష్యంగా ఆయన సాగిస్తున్న ఈ ప్యాలెస్ పర్యటనలు జగన్ మార్క్ రాజకీయాలు అనుకోవడమే.
