తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు సరికొత్త మలుపులు తిరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్న కొద్దీ, ఈ వ్యవహారం వెనుక ఉన్న చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా దుబాయ్‌లో డ్రగ్స్ ఓవర్డోస్తో మరణించినట్లు చెబుతున్న కేదార్ అనే వ్యక్తికి, రోహిత్ రెడ్డికి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు , స్నేహ సంబంధాలపై పోలీసులు ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేదార్‌తో బీఆర్ఎస్ అగ్రనేతలకు ఉన్న సాన్నిహిత్యంపై వస్తున్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
కేదార్‌తో రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు
పోలీసు విచారణలో భాగంగా రోహిత్ రెడ్డి , అతని సోదరుడు రితేష్ రెడ్డి ఖాతాల నుండి కేదార్‌కు దాదాపు 25 లక్షల రూపాయలు బదిలీ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. గతేడాది దుబాయ్‌లో కేదార్ మరణించిన సమయంలో రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నారన్న ప్రచారంపై ఇప్పుడు ఆరా తీస్తున్నారు. కేదార్ కేవలం ఒక డ్రగ్ పెడ్లర్ మాత్రమే కాదని, దుబాయ్‌లో ప్రముఖులకు చెందిన ఆస్తులను, పెట్టుబడులను మేనేజ్ చేసే కీలక వ్యక్తి అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే రోహిత్ రెడ్డిని డ్రగ్స్ కేసులో విచారిస్తుంటే, ఆ దారులు మెల్లగా దుబాయ్ పెట్టుబడుల వైపు మళ్లుతున్నాయి.
కేటీఆర్ పేరునూ తెస్తున్న కాంగ్రెస్
ఈ డ్రగ్స్ దందాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సంబంధాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. కేదార్ ద్వారా దుబాయ్‌లో బినామీ ఆస్తుల నిర్వహణ జరిగిందని, ఆ గుట్టు బయటపడకుండా ఉండేందుకే రోహిత్ రెడ్డి మౌనం వహిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని, కేటీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు చేస్తున్న కుట్ర అని వారు వాదిస్తున్నారు.
మళ్లీ కస్టడీకి తీసుకునేందుకు పోలీసుల ప్రయత్నం
ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న రోహిత్ రెడ్డి కస్టడీని పొడిగించాలని పోలీసులు కోరుతున్నారు. కేదార్ మరణం, దుబాయ్ కనెక్షన్లు, ఫామ్‌హౌస్ పార్టీలో జరిగిన కాల్పుల ఘటనలను ముడిపెట్టి సమగ్ర విచారణ జరుపుతున్నారు. రోహిత్ రెడ్డి నోరు విప్పితే, ఈ డ్రగ్స్ రాకెట్ వెనుక ఉన్న పెద్ద తలకాయల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన అరెస్టులు ఉండే అవకాశం కనిపిస్తోంది.
