ఎవరైనా కష్టపడి సాధించుకుందామనుకుంటారు కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం కళ్లు మూసుకుని కూర్చుందాం..అన్నీ మనకు వచ్చేస్తాయని అనుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలకూ అదే చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లు కళ్లు మూసుకున్న ఆయన ఇప్పుడు కూడా అలాగే చేయండి ఇట్టే గడిచిపోతాయి అని సలహాలిస్తున్నారు. ఆయన మాటలతో అందరూ ఇదేం లాజిక్ అని వింతగా చూస్తున్నారు.
కళ్లు మూసుకోండి.. మ్యాజిక్ జరుగుతుంది!
జగన్ మార్క్ రాజకీయంలో ఒక విచిత్రం ఉంది. పోరాడితే గెలుస్తాం అన్న నినాదం కంటే, ఎదుటివాడు ఓడితే మనం గెలుస్తాం అనే లాజిక్‌ను ఆయన ఎక్కువగా నమ్ముతారు. అందుకే ఇప్పుడు కేడర్‌కు ఆయన ఇస్తున్న సందేశం ఒక్కటే.. మనం ఏమీ చేయనక్కర్లేదు, గమ్మున కళ్లు మూసుకుని కూర్చుందాం. చంద్రబాబు ప్రభుత్వం తప్పులు చేస్తుంది, ప్రజలు విసిగిపోతారు, అప్పుడు మళ్లీ మనకే పట్టం కడతారు . అంటే, ఒక స్టూడెంట్ పరీక్షలు రాయకుండా, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు ఏదో ఒక తప్పు చేస్తాడని, అప్పుడు తనకు ర్యాంక్ వస్తుందని కళ్లు మూసుకుని కలలు కనడం లాంటిదే ఈ వ్యవహారం.
కామెడీ షో.. ప్రెస్ మీట్లు
చాలా కాలం మౌనంగా ఉండి, అప్పుడప్పుడు బయటకు వచ్చి జగన్ పెట్టే ప్రెస్ మీట్లు ఇప్పుడు పొలిటికల్ కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. అమరావతిని దేవతల రాజధాని అని చంద్రబాబు అంటే.. దానికి పోటీగా జగన్ తన మైండ్ నుంచి మావిగాన్ అనే తుపాకీ లాంటి పేరును కనిపెట్టారు. ఈ పేరు విన్న నెటిజన్లు, విశ్లేషకులు ఇదెక్కడి వింత పేరు సామీ అంటూ మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. కేఏ పాల్‌కు పోటీ ఇచ్చేలా జగన్ వ్యాఖ్యలు ఉంటున్నాయని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి.
రిపీట్ కాని అద్భుతం
2019లో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత జగన్‌కు కలిసొచ్చింది. అది ఒకసారి జరిగిన అద్భుతం. కానీ ప్రతిసారీ ప్రజలు అవే తప్పులు చేస్తారని, తాము చేసిన 151 సీట్ల విధ్వంసాన్ని మర్చిపోతారని జగన్ భ్రమపడుతున్నారు. నేను బటన్ నొక్కాను కాబట్టి మళ్ళీ నన్నే సీఎం చేస్తారు అనే గతానుభవాల నుంచి ఆయన ఇంకా బయటకు రాలేదు. ప్రతిపక్షం అంటే ప్రజల తరపున నిలబడాలి కానీ, ప్రజలు ఎప్పుడు ప్రభుత్వంపై తిరగబడతారా అని డేటింగ్ అప్లికేషన్లా ఎదురుచూడటం ఆయనకే చెల్లింది.
పోరాటం లేని సైన్యం.. నిద్రపోతున్న నాయకుడు
రాష్ట్రంలో వైసీపీ కేడర్ కేసులతో, వేధింపులతో సతమతమవుతుంటే.. అధినేత మాత్రం ప్రజలే తేల్చుకుంటారు అని చేతులు ఎత్తేయడం విడ్డూరం. గతం జగన్ రెడ్డిని ఈ మాయ ఎప్పుడు వదులుతుందో, ప్రజలు మరోసారి షాక్ ఇస్తేనే తెలుస్తుంది. రాజకీయంలో రాజీపడటం వేరు, అసలు అస్త్ర సన్యాసం చేసి కళ్లు మూసుకోండి అని చెప్పడం వేరు. జగన్ రెడ్డి రెండూ చేస్తున్నారు.
