తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ మరీ ఏనుగు ఏడు వానల కథలా మారిపోయింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా, కష్టపడిన కేడర్‌కు పదవుల పంపకం జరగకపోవడంతో పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న అసహనాన్ని గుర్తించిన అధిష్టానం.. మరో రెండు రోజుల్లో కీలకమైన కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లుగా మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ ఎవరూ నమ్మలేకపోతున్నారు.
ఇదిగో..అదిగో అని కాలయాపన
నామినేటెడ్ పదవుల భర్తీపై గడిచిన ఏడాది కాలంగా అనేకసార్లు గడువులు మారాయి. ఫిబ్రవరిలో స్వయంగా మహేష్ కుమార్ గౌడ్ మార్చి 15 నాటికి ప్రక్రియ పూర్తవుతుంది అని ప్రకటించినప్పటికీ, అది ఆచరణలోకి రాలేదు. అధికార దాహం తీరని ద్వితీయ శ్రేణి నాయకులు ఇక మాకు పదవులు రావు అనే నైరాశ్యంలో మునిగిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు పరిపాలన, మరోవైపు జాతీయ స్థాయి రాజకీయాల్లో బిజీగా ఉండటంతో పార్టీ సంస్థాగత విషయాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకుండా టీపీసీసీ చీఫ్ కూడా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది.
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు
ఈ విపరీతమైన జాప్యం పార్టీ అంతర్గత క్రమశిక్షణపై ప్రభావం చూపుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులు.. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కూడా దక్కకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రెండున్నరేళ్ల పాలన గడిచిపోయింది, మిగిలిన తక్కువ సమయంలో పదవులు దక్కించుకుని ఏం లాభం అన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. ఈ అసంతృప్తిని ఆసరాగా చేసుకుని విపక్షాలు కాంగ్రెస్ నాయకులకు గాలం వేసే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతోనే రేవంత్ రెడ్డి ఈ వేగవంతమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇప్పుడైనా ప్రకటిస్తారా?
తొలి విడతలో దాదాపు 30 నుంచి 40 కార్పొరేషన్ చైర్మన్ పదవులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇందులో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయాలని, ముఖ్యంగా మహిళలకు 20 శాతం వాటా ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. అయినప్పటికీ, పార్టీలోని సీనియర్లకు ,జూనియర్లకు మధ్య సమతుల్యత సాధించడం రేవంత్ రెడ్డికి కత్తిమీద సాము లాంటిదే. ఒకరిని ప్రసన్నం చేస్తే మరొకరు అలిగే పరిస్థితి ఉండటంతో, జాబితా రూపకల్పనలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. కేడర్‌లో నమ్మకం కలగాలంటే ఈ సారి ప్రకటనలు కాకుండా నియామక ఉత్తర్వులు నేరుగా వెలువడాల్సి ఉంది. ఈ రెండు రోజుల్లో గనుక నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగకపోతే, అసంతృప్తి సెగలు మరింత ముదిరి పార్టీని సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉంది.
