నియోజకవర్గాల పునర్విభజన విషయంలో బీజేపీని నమ్మలేమని..దక్షిణాదికి అన్యాయం జరిగితే తిరగబడతామని కేటీఆర్ ప్రకటించారు. కానీ ఆయన మిత్రుడు జగన్ మాత్రం మరో మాట లేకుండా మద్దతుప్రకటించారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు జరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న ఆందోళనతో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ గళమెత్తుతుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం అనూహ్యంగా మద్దతు ప్రకటించారు. సింహం సింగిల్ అని గర్జించిన నాయకుడు, ఇప్పుడు ఇలా అయిపోవడం వైసీపీ కార్యకర్తల్నీ నిరాశ పరుస్తోంది.
గళమెత్తితే జగన్‌కు గొప్ప రాజకీయ అవకాశం
దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై పోరాడటం జగన్‌కు ఒక గొప్ప రాజకీయ అవకాశంగా మారేది. కానీ, కేంద్రం బిల్లును ప్రవేశపెట్టకముందే మద్దతు ప్రకటించే స్థాయికి ఆయన వెళ్లడం వెనుక జైలు భయం ఉందని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి సీనియర్ విశ్లేషకులు గతంలోనే చెప్పినట్లు, రాజకీయాల్లో జైలుకు వెళ్లడం అనేది ఒక్కోసారి ప్రజల్లో సానుభూతిని పెంచి తిరుగులేని నాయకుడిగా మార్చుతుంది. అయితే, జగన్ మాత్రం ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరని ఆయన తాజా నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టినా సరే, న్యాయపరమైన చిక్కుల నుంచి తాత్కాలిక ఊరట పొందడమే లక్ష్యంగా ఆయన అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది.
ఎన్డీఏ పార్టీల కంటే ఎక్కువగా సపోర్టు
అధికారంలో ఉన్న కూటమి రాష్ట్ర అభివృద్ధి ఎజెండాతో ముందుకు వెళ్తుంటే, ప్రతిపక్షంలో ఉన్న జగన్ కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేకపోవడం ఆయన కేడర్‌ను కూడా నైరాశ్యంలోకి నెట్టివేస్తోంది. గట్టిగా నిలబడాల్సిన చోట జగన్ సరెండర్ పాలిటిక్స్ చేయడం ఆయన భవిష్యత్తు నాయకత్వానికే ముప్పు తెచ్చేలా ఉంది. పోరాడితే పోయేదేమీ లేదు.. కానీ లోబడితే మాత్రం రాజకీయ అస్తిత్వమే ప్రశ్నార్థకమవుతుంది. కానీ తాను ఎన్డీఏ కూటమి పార్టీ అధ్యక్షుడ్ని అన్నట్లుగా ఆయన వ్వవహరిస్తున్నారు.
నేరాలు చేయడం ఎందుకు.. ఇలాంటి బానిసత్వం ఎందుకు?
జగన్ తీసుకుంటున్న ఈ జాగ్రత్తలు ఆయనను కేసులు, జైలు నుంచి కాపాడవచ్చోమో కానీ, ఒక నాయకుడిగా ఆయనకున్న ఇమేజ్ను మాత్రం దెబ్బతీస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాలు ఏకమవుతున్న వేళ, జగన్ ఒంటరిగా కేంద్రానికి జై కొట్టడం అటు ప్రజల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆయన విశ్వసనీయతను పరీక్షకు పెడుతోంది. ఈ రాజీ పంథా ఆయనకు మేలు చేస్తుందో లేక రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తీస్తుందో కాలమే నిర్ణయించాలి.


