దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన సెగలు రేపుతున్న వేళ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు తెచ్చిన 50:50 ఫార్ములా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుందనే భయంతో ఆయన ఈ హైబ్రిడ్ నమూనాను ప్రతిపాదించారు. జనాభాతో పాటు రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధిని సమానంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన చెబుతున్నారు. ఆయన చెప్పిన ప్రకారం లెక్కలేస్తే దక్షిణాదికి నష్టం జరుగుతుంది.
రేవంత్ లెక్కల ప్రకారం ఇలా సీట్ల కేటాయింపు
రేవంత్ రెడ్డి ప్రతిపాదన ప్రకారం లోక్సభ స్థానాల సంఖ్య 816కు పెరిగితే.. అందులో జనాభాకు 408, జీడీపీకి 408 సీట్లు కేటాయించాలి. అయితే ఈ సమీకరణం అమల్లోకి వస్తే దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్ర, పారిశ్రామికంగా పురోగమించిన గుజరాత్ రాష్ట్రాలు అప్రతిహతమైన రాజకీయ శక్తిగా ఎదిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల ఉమ్మడి బలం 12.5 శాతంగా ఉండగా, ఈ కొత్త మోడల్లో అది ఏకంగా 18 శాతానికి పెరిగిపోతుంది. అంటే దేశ రాజకీయ పగ్గాలను శాశ్వతంగా ఆయా రాష్ట్రాల చేతిలో పెట్టడమే అవుతుంది.
తెలుగు రాష్ట్రాలకు నష్టమే
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను గమనిస్తే ఈ ఫార్ములా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. కొత్త లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ 36 స్థానాలకు, తెలంగాణ 32 స్థానాలకే పరిమితమవుతున్నాయి. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ 102 స్థానాలతో తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకోనుంది. జనాభా నియంత్రణ పాటించి ఆర్థికంగా బాధ్యతాయుతంగా ఉన్నామని గర్వంగా చెప్పుకునే దక్షిణాది రాష్ట్రాలకు ఈ 50-50 ఫార్ములా కూడా మొండిచేయే చూపుతోంది. దక్షిణాది ఐదు రాష్ట్రాల ఉమ్మడి బలం కంటే ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల కూటమి బలమే ఈ మోడల్లో భారీగా పెరగడం గమనార్హం.
జీడీపీ లెక్కలు వేసినా దక్షిణాదికి అన్యాయం
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆర్థికంగా వెనుకబడిన బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఈ పద్ధతిలో అదనపు సీట్లను చేజిక్కించుకుంటున్నాయి. కేవలం జీడీపీని లెక్కలోకి తీసుకుంటే దక్షిణాది బాగుపడుతుందని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని.. ఢిల్లీ వంటి చిన్న రాష్ట్రం కూడా తన ఆర్థిక వాటాతో 24 స్థానాలను పొంది పెద్ద రాష్ట్రాలతో పోటీ పడటం దేశ సమాఖ్య వ్యవస్థలో కొత్త అసమానతలకు దారితీస్తుందని లెక్కలు చెబుతున్నాయి.
ఓ ఫార్ములానే…. ప్రోరాటా ప్రకారమే న్యాయం!
రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్న ఈ హైబ్రిడ్ మోడల్ కేవలం రాజకీయ ప్రతిపాదనగానే మిగిలిపోయేలా ఉంది. దక్షిణాదికి రక్షణగా ఉంటుందని చెప్తూనే.. పరోక్షంగా గుజరాత్-మహారాష్ట్ర లాబీని బలపరిచేలా ఈ గణాంకాలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన జరిగే అన్యాయాన్ని అరికట్టే పేరుతో మరో అశాస్త్రీయమైన పద్ధతిని తీసుకురావడం వల్ల దక్షిణాదికి ఒరిగేదేమీ లేదు. ప్రోరాటా ప్రకారం దక్షిణాదికి ఉన్న24 శాతం సీట్లను కొనసాగించడమే న్యాయం చేయడం.
