మహోన్నత శక్తి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, దశాబ్దాల కాలంగా తెలుగు రాజకీయాల్లో ఒక ధ్రువతారగా వెలుగుతోంది. ఎన్టీఆర్ తర్వాత పార్టీ మనుగడపై నాడు అనేక సందేహాలు వ్యక్తమైనప్పటికీ, చంద్రబాబు నాయుడు తనదైన వ్యూహరచనతో, సాంకేతికతను జోడించి పార్టీని కేవలం ఒక రాజకీయ సంస్థగా కాకుండా, ఒక పటిష్టమైన వ్యవస్థగా తీర్చిదిద్దారు. ఇప్పుడు అదే పరంపరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. పార్టీ పగ్గాలను నారా లోకేష్‌కు అప్పగిస్తూ, యువ రక్తాన్ని పార్టీ నరనరాల్లోకి ఎక్కించే ప్రక్రియ సక్సెషన్ ప్లానింగ్ లో ఒక పాఠ్యపుస్తకంలా కనిపిస్తోంది.
పార్టీ కమిటీల లక్ష్యం కొత్త తరానికి పార్టీ నాయకత్వం
తాజాగా ప్రకటించిన పార్టీ కమిటీలు కేవలం పదవుల పంపిణీ మాత్రమే కాదు, అది రాబోయే మూడు దశాబ్దాల రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేసిన ఒక భారీ మాస్టర్ ప్లాన్. నారా లోకేష్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం ద్వారా పార్టీలో ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగళం పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైన లోకేష్, ఇప్పుడు పార్టీ అంతర్గత వ్యవహారాల్లోనూ తనదైన ముద్ర వేయబోతున్నారు. ఇది పాత తరం అనుభవాన్ని, కొత్త తరం వేగాన్ని మేళవించే ఒక అద్భుతమైన ప్రయోగం.
పార్టీ కోసం పని చేసే వారికీ పట్టం
పార్టీ కమిటీల ప్రకటనలో కనిపించిన ప్రధాన మార్పు విధేయత , పనితీరు . గత ఐదేళ్లలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటే ఉండి పోరాడిన నాయకులకు పెద్దపీట వేయడం ద్వారా, క్యాడర్లో ఒక కొత్త ఉత్సాహం నింపారు. పొలిట్ బ్యూరో నుంచి గ్రామ స్థాయి కమిటీల వరకు యువతకు, ముఖ్యంగా సమర్థత కలిగిన విద్యావంతులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా టీడీపీ తన రూపురేఖలను మార్చుకుంటోంది. సోషల్ మీడియా యుగంలో మారుతున్న రాజకీయ సమీకరణాలను తట్టుకునేలా, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువ టీమ్‌ను రంగంలోకి దించడం చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనం.
సిద్ధాంతవారసత్వాన్ని ముందుకు తీసుకేళ్లే యువసైన్యం
ఈ మార్పు ఒక రాజకీయ సిద్ధాంత వారసత్వం. ఎన్టీఆర్ ఆశయాలను, చంద్రబాబు అభివృద్ధి మంత్రాన్ని పుణికిపుచ్చుకున్న ఈ సరికొత్త టీమ్, టీడీపీని మరిన్ని దశాబ్దాల పాటు ప్రజల గొంతుకగా నిలబెట్టే అవకాశం ఉంది. క్రమశిక్షణ కలిగిన క్యాడర్, స్పష్టమైన నాయకత్వం ఉన్న ఏ పార్టీ అయినా ఒడిదుడుకులు తట్టుకుంటుందని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. లోకేష్ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి ఇది కేవలం రీ-బ్రాండింగ్ మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలకు పార్టీని పటిష్టంగా అప్పగించే ఒక బాధ్యతాయుతమైన ప్రయాణం.


