విజయాలూ, వివాదాలూ గాయని మంగ్లీకి కొత్త కాదు. ఎప్పుడూ ఓ పాటతోనో, కాంట్రవర్సీతోనో మంగ్లీ పేరు మార్మోగుతూ ఉంటుంది. ఈసారి తనపై రూ.10 కోట్ల మేర చీటింగ్ కేసు.. దానికి సంబంధించిన ఫిర్యాదులు, ప్రతిగా మంగ్లీ కూడా ప్రత్యారోపణ చేస్తూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం.. టాక్ ఆఫ్ ది ఫిల్మ్ నగర్ గా నిలిచాయి. అయితే ఈ మధ్యలో దర్శకుడు వేణు ఉడుగుల పేరు రావడం తో.. ఈసారి సిట్యువేషన్‌ని మరింత రసవత్తరంగా మార్చేశాయి.
మైక్రో ఫైనాన్స్ కి సంబంధించిన గోల ఇది. మంగ్లీ, ఆమె సోదరుడు, మరికొంతమంది కలిసి, మైక్రో ఫైనాన్స్ పేరిట దాదాపు రూ.150 కోట్లు సేకరించారని, ఈ మేరకు తనకు రూ.10 కోట్ల మేరకు టోకరా వేశారని, దీనిపై అడిగితే మంగ్లీ, అతని మనుషులు తనని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని సుబ్బారావు అనే లాయర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే మంగ్లీ కూడా సదరు సుబ్బారావు అనే లాయర్ పై కంప్లైంట్ ఫైల్ చేశారు. తనకు సంబంధం లేని విషయాల్లో తనని ఇరికించాలని చూస్తున్నారని, ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నారన్నది మంగ్లీ ఫిర్యాదులోని సారాంశం. ఇలా పరస్పర ఫిర్యాదులతో ఈరోజు వాతావరణం వేడెక్కించాయి ఇరు వర్గాలూ. మంగ్లీకీ, సుబ్బారావు అనే న్యాయవాదికీ మధ్యవర్తిత్వం చేద్దామనుకొన్న దర్శకుడు వేణు ఉడుగుల పేరు ఈ కేసులో తప్పుడు ప్రచారంలో భాగమైంది. వేణు ఉడుగులకు కూడా ఈ చీటింగ్ కేసుతో సంబంధం ఉంది అన్నట్టుగా వార్తలొచ్చాయి. అయితే దీనిపై వేణు స్పందించారు. తాను కేవలం మధ్యవర్తిత్వం వహించాలని చూశానని, అంతే తప్ప తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. మరోవైపు సుబ్బారావు కూడా ఇదే మాట చెప్పారు. ఈ కేసుతో వేణు ఉడుగులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు.
ప్రతీసారీ మంగ్లీనే ఎందుకు టార్గెట్ అవుతోంది? తనపైనే ఇన్ని వివాదాలు ఎందుకు? అనేది ఆలోచించాల్సిన విషయం. మంగ్లీ బర్త్ డే పార్టీలో డ్రగ్స్ అంటూ అప్పట్లో కలకలం రేగింది. అంతకు ముందు ఓ పార్టీకి వంత `పాడి` విమర్శల పాలైంది. ఇప్పుడు ఈ చీటింగ్ కేసు.
ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మధు అనే వ్యక్తి ఓ మైక్రో ఫైనాన్స్ కంపెనీ మొదలు పెట్టాడు. మంగ్లీ పేరు చెప్పి లక్షలు లక్షలు వసూలు చేశాడు. మంగ్లీ లాంటి సెలబ్రెటీ పేరు వాడుకోవడం వల్ల.. పెట్టుబడులు బాగా వచ్చాయి. నెలకు రూ.4 నుంచి రూ.5 వడ్డీ, 16 నెలలు తరవాత బోనస్‌గా ఓ ప్లాట్ ఇస్తానని ఆశ చూపి, దాదాపు 150మంది నుంచి కోట్లకు కోట్లు దండు కొన్నట్టు తెలుస్తోంది. ఇందులో చాలామంది 4 నుంచి 5 లక్షల లోపు ఇచ్చినవాళ్లే. కొంతమందికి అనుకొన్న సమయానికి వడ్డీ ఇచ్చేయడంతో, అదే ధీమాతో చాలామంది ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అదును చూసుకొని బిచాణా ఎత్తేయడంతో వ్యవహారం మొత్తం బయటపడింది.
మధు అనే వ్యక్తి మంగ్లీని రెండు మూడుసార్లు కలిసినట్టు తెలుస్తోంది. దాన్ని అసరాగా తీసుకొని మంగ్లీ పేరుని వాడుకొని ఉండొచ్చు. కాకపోతే మంగ్లీ కి కూడా ఈ వ్యాపారంతో సంబంధం ఉందా, ఆమెకూడా పెట్టుబడులు పెట్టారా అనేది పోలీసులు తేల్చాల్సిన విషయం.
ఇటీవల మంగ్లీ దగ్గరకు వెళ్లి బాధితులు కూడా మొర పెట్టుకొన్నట్టు తెలుస్తోంది. అప్పుడే మంగ్లీ ఫోన్ నుంచి.. మధుని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించారని తెలుస్తోంది. అదే సమయంలో బాధితుల తరపున దర్శకుడు వేణు ఉడుగుల మధ్యవర్తిత్వం వహించారు. కేవలం బాధితుల బాధ చూడలేకే ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించాలని చూశానని వేణు చెబుతున్నారు. మధుకి సంబంధించి అన్ని వివరాలూ మంగ్లీకి తెలుసన్నది బాధితుల ఆరోపణ. మంగ్లీ ఏమో తనకేమాత్రం సంబంధం లేని విషయంలో తనని ఇరికించాలని కుట్ర పన్నుతున్నారని అంటున్నారు. ఇక ఈ కేసు తేల్చాల్సింది పోలీసులే.
