నెయ్యి స్కాంలో సీబీఐ సిట్ చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో జంతువుల కొవ్వు కలసిందని చెప్పలేదని కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కానీ పూర్తి స్థాయిలో కల్తీ జరిగిందని సిట్ తేల్చిందన్న విషయాన్ని మాత్రం వారు చెప్పడం లేదు. దాన్ని అంగీకరిస్తే.. ఈ కల్తీని అంగీకరించినట్లే. ఇప్పుడు శిక్షకు రెడీ కావాల్సి ఉంది. నిజానికి హిందూభక్తుల మనోభావాల కోసమే కొన్ని అంశాలను సీబీఐ సిట్.. బహిరంగపర్చలేదని చెబుతున్నారు.
టీటీడీ చరిత్రలో చీకటి అధ్యాయం
కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి పవిత్ర నైవేద్యం లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారం ఇప్పుడు యావత్ హిందూ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో భక్తి కంటే వ్యాపారానికే పెద్దపీట వేస్తూ, స్వామివారికి సమర్పించే నెయ్యి విషయంలో జరిగిన ఘోరమైన కల్తీని సెట్ నిర్ధారించడంతో భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, కొందరి జేబులు నింపుకోవడం కోసం హిందువుల నమ్మకాన్ని తాకట్టు పెట్టడం శతాబ్దాల తిరుమల చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం.
ల్యాబ్ రిపోర్టుల సాక్షిగా.. నమ్మలేని నిజాలు
గుజరాత్ ల్యాబ్ రిపోర్టులో జంతువుల కొవ్వు కలిసిందని తేలినా, ఇంకా బుకాయిస్తున్న వైకాపా నేతల తీరు భక్తుల పుండు మీద కారం చల్లినట్లుగా ఉంది. సిట్ దర్యాప్తులో కేవలం కల్తీ నెయ్యి సరఫరా మాత్రమే కాదు, నిబంధనలకు విరుద్ధంగా కెమికల్స్‌తో తయారు చేసిన నెయ్యిని కూడా వాడారని ఆధారాలతో సహా బయటపడుతోంది. ఏ ఏ కంపెనీల నుండి నెయ్యి వచ్చింది.. ఏ ఏ లెక్కలు మాయం చేశారు.. అన్నది ఇప్పుడు స్పష్టమవుతోంది. జంతువుల కొవ్వు కలవలేదు కదా అని వాదిస్తున్న నేతలు, అసలు కల్తీ నెయ్యిని వాడటమే స్వామివారికి చేసిన ద్రోహం కాదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.ఈ విషయంలో సిట్ హిందూ భక్తుల మనోభావాల కోసం కొన్ని విషయాలను రహస్యంగా ఉంచినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు.
ఐదేళ్ల పాటు సాగిన అపవిత్రం
ఐదు సంవత్సరాల పాటు తిరుమల పవిత్రతను భ్రష్టు పట్టిస్తూ, భక్తుల మనోభావాలతో ఆడుకున్న తీరు క్షమించరాని నేరం. పవిత్రమైన నెయ్యిని కాకుండా, రసాయనాలు కలిపిన నూనెలను, కల్తీ పదార్థాలను వాడటం ద్వారా కోట్లాది మంది హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీసినట్లయింది. ఇది కేవలం ఒక టెండర్ అవినీతి కాదు, సనాతన ధర్మంపై జరిగిన దాడి. కల్తీ జరిగిందని ఇప్పుడు పరోక్షంగా ఒప్పుకుంటున్న నేతలు, చేసిన పాపానికి సమాధానం చెప్పుకోక తప్పదు. చట్టపరమైన విచారణలో దోషులకు శిక్ష పడుతుందో లేదో కానీ, ఆ ఏడుకొండల వాడి దర్బారులో మాత్రం శిక్ష తప్పదని భక్తులు బలంగా నమ్ముతున్నారు. హిందువుల అత్యంత పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారికి, దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడని అందరి బలమైన నమ్మకం.
