తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ప్రత్యేక విచారణ బృందం గత ప్రభుత్వ హయాంలో అత్యున్నత పదవుల్లో ఉన్న ముగ్గురు మాజీ ఐఏఎస్ అధికారులతో పాటు, ఐపీఎస్ అధికారులను సిట్ విచారిస్తోంది. ముఖ్యంగా ఇద్దరు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సోమేష్ కుమార్, శాంతి కుమారిలను విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
గత ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన అధికారిగా వెలుగొందిన ప్రభాకర్ రావును ఎస్ఐబీ ఓఎస్డీ గా నియమించడంపై సిట్ అధికారులు మాజీ ఐఏఎస్‌లను ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన నియామకం వెనుక ఉన్న వాళ్లెవరు అనే కోణంలో అధికారులు ఆరా తీశారు. అలాగే జీఏడీ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావును కూడా విచారించి, ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన కీలక పత్రాల గురించి వివరణ తీసుకున్నారు.
రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధుల ఫోన్లను ట్యాప్ చేసేందుకు ప్రభాకర్ రావు పంపిన నంబర్ల జాబితాను హోం శాఖకు ఎలా పంపేవారనే అంశంపై ఆరా తీస్తున్నారు. ప్రభాకర్ రావు ఇచ్చిన నంబర్లను ఎటువంటి పరిశీలన లేకుండానే యథావిధిగా హోం శాఖకు చేరవేసినట్లు మాజీ ఐపీఎస్ అధికారుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
