తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనకు నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు, ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేసిన వ్యవహారంలో హరీష్ రావు పాత్రపై సిట్ ఆరా తీస్తోంది. ఒక ప్రముఖ టీవీ ఛానల్ యజమాని ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఈ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. సదరు ఛానల్ ఎండీతో కలిసి హరీష్ రావు ట్యాపింగ్ చేయించినట్లు ప్రాథమిక విచారణలో సిట్ గుర్తించినట్లు సమాచారం.
హరీష్ రావును మంగళవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని సిట్ ఆదేశించింది. నోటీసులను ఆయన ఇంట్లో అందించింది. ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? ఏయే నంబర్లను ట్యాప్ చేశారు? అనే కోణంలో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. గతంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు , ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటికే పలువురు అధికారులను విచారించిన సిట్, ఇప్పుడు రాజకీయ నేతల వైపు దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఛానల్ యజమాని స్టేట్మెంట్ హరీష్ రావుకు ఇబ్బందికరంగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తన ఫోన్ ను ట్యాపింగ్ చేయించారని గతంలో చక్రధరరావు అనే వ్యక్తి చేసిన పిటిషన్ లో హరీష్ రావుకు ఊరట లభించింది. కానీ ఈ కేసు వేరే. ఈ నోటీసులపై హరీష్ రావు ఇంకా స్పందించలేదు. ఇవాళ నోటీసులు ఇచ్చి రేపు ఉదయమే విచారణకు రమ్మంటున్నారన్న కారణంగా ఆయన డుమ్మా కొడతారా.. కేసు సీరియస్నెస్ దృష్ట్యా హాజరవుతారా అన్నది బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది.

