హైదరాబాద్: అర్జంట్‌గా ఆంధ్రా కేజ్రీవాల్‌గా అవతరించాలని ఉవ్విళ్ళూరుతున్న హీరో శివాజి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకున్నట్లు కనబడుతోంది….కనీసం తిట్ల విషయంలో. ఎవరినైనా విమర్శించాల్సివస్తే నేరుగా అన్ పార్లమెంటరీ భాషలోకి వెళ్ళిపోతున్నారు. నిన్న విజయవాడలో ఏపీకి ప్రత్యేకహోదాపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ, ఆంధ్రాప్రజలందరి తరపున వకాల్తా పుచ్చుకుని నిప్పులు చెరిగారు. తెలుగు ప్రజలను చులకనగా చూస్తే చెప్పులతో కొడతామని అన్నారు(అంటే రెండురాష్ట్రాల తరపునా వకాల్తా పుచ్చుకున్నారన్నమాట – చులకనగా ఎవరు మాట్లాడారో ఆయనకే తెలియాలి). తెలుగుదేశం ఎంపీలు మోడి కాళ్ళదగ్గర చెంచాలుగా మారారని విమర్శించారు. జగన్ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన కాకుండా పార్లమెంట్‌లో నిలదీయాలన్నారు. పవన్ అన్నయ్య ట్వీట్‌లు కాకుండా రోడ్డుమీదకు రావాలన్నారు(పవన్‌ను అంతకంటే ఎక్కువ తిడితే ఫ్యాన్స్ కొడతారని తెలుసు గురుడికి!).
ఇక ఇవాళ ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం ప్రకటించిన తర్వాత శివాజి మరింత రెచ్చిపోయారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఊరుకునేది లేదని కేంద్రాన్ని హెచ్చరించారు. మోడి గుజరాత్ తెలివితేటలు ఆంధ్రలో చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధానికి ఆంధ్రప్రజల ఉసురు తప్పక తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. జగన్ తన కేసులకు భయపడి కేంద్రాన్ని నిలదీయటంలేదని, చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికిపోవటంమూలంగా కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఇక ఏపీ ఎంపీలపై నిప్పులు చెరిగారు. వారు సిగ్గులేని దద్దమ్మలని మండిపడ్డారు.