తెలుగమ్మాయ్ శివానీ రాజశేఖర్ తన తొలి తెలుగు సినిమాలో బెంగాలీ అమ్మాయిగా కనిపించనుంది. హిందీ హిట్ ‘టు స్టేట్స్’కి తెలుగు రీమేక్‌తో శివాని కథానాయికగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రాజమౌళి క్లాప్ ఇవ్వగా… ప్రముఖ నటులు కృష్ణంరాజు, దర్శకులు రాఘవేంద్రరావు తదితరులు హాజరయ్యారు. ఇందులో అడివి శేష్ క్రిష్ పాత్రలో, శివాని అనన్య పాత్రలో కనిపించనున్నారు.
హిందీ ‘టు స్టేట్స్’ సినిమాలో హీరో పాత్ర పంజాబీ కుర్రాడిగా, హీరోయిన్ పాత్ర తమిళ్ బ్రాహ్మణుల అమ్మాయిగా వుంటుంది. తెలుగుకు వచ్చేసరికి రెండు పాత్రల్లో నేపథ్య పరంగా రెండు మార్పులు చేశారు. తెలుగులో హీరో పాత్రను హైదరాబాద్ కుర్రాడిగా, హీరోయిన్ పాత్రను కలకత్తా నుంచి వచ్చిన బ్రాహ్మణుల అమ్మాయిగా తీర్చి దిద్దారు. ఇందులో హీరోయిన్ తల్లిగా సల్మాన్ ‘ప్రేమ పావురాలు’ ఫేమ్ భాగ్యశ్రీ నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్ కుంచం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.