ఈ మూడు రోజులూ మోడీ ఇలా చేయ‌మ‌న్నార‌ట‌..!

విభ‌జ‌న హామీల అంశ‌మై ఆంధ్రా ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వ‌డం, ఆర్డ‌ర్ లో లేద‌ని స‌భ వాయిదా వేయ‌డం కేంద్రానికి అల‌వాటుగా మారిపోయింది. ఈ క్ర‌మంలో, లోక్ స‌భ‌ను ఆర్డ‌ర్ లో ఉంచాల్సిన బాధ్య‌త‌, స‌మావేశాల‌ను స‌జావుగా నిర్వ‌హించడానికి వారు చేయాల్సిన కృషిని వ‌దిలేస్తున్నారు. ఈ వారంత‌మంతా వాయిదాల ప‌ర్వ‌మే న‌డిచింది. స‌భ‌కు మూడు రోజులు సెల‌వులు వ‌చ్చాయి. ఈ సెల‌వు రోజుల్లో ఏం చేయాలీ..? ఇదే అంశ‌మై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, భాజ‌పా అధ్య‌క్షుడు అమిత్ షాలు క‌లిసి ఎంపీల‌కు దిశా నిర్దేశం చేశారు. ఏమిటా దిశా నిర్దేశ‌మంటే… ఎంపీలు త‌మ నియోజ‌క వ‌ర్గాల్లో ప్రెస్ మీట్లు పెట్టి, స‌భ స‌జావుగా ఎందుకు సాగ‌డం లేదో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ట..!

ఆంధ్రాకి ఎలాంటి అన్యాయ‌మూ కేంద్రం చేయ‌లేద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ప్ర‌తిప‌క్షాలు కుట్ర పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల‌నే పార్ల‌మెంటు స‌జావుగా సాగ‌డం లేద‌న్నారు. వ‌రుస భాజ‌పా విజ‌యాలు సాధిస్తోంద‌నీ, దీంతో ప్ర‌తిప‌క్షాలు అత్యంత నిరాశ నిస్ప్రుహ‌ల‌కు లోనౌతోంద‌నీ, అందుకే పార్ల‌మెంటు స‌మావేశాల‌ను అడ్డుకుంటున్నాయ‌ని మోడీ అన్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టంగా తెలియ‌జేయాల‌ని ఎంపీల‌కు పిలుపునిచ్చారు. ఈ మూడు రోజుల సెల‌వు దినాల‌ను ఈ ర‌కంగా వినియోగించుకోవాల‌ని సూచించారు.

స‌భ స‌జావుగా సాగ‌క‌పోవ‌డానికి కార‌ణం.. భాజ‌పా వ‌రుస విజ‌యాల‌ను చూసి ప్ర‌తిప‌క్షాల ఓర్వ‌లేనిత‌నమే అన్న‌మాట‌..! భాజ‌పా వైఫ‌ల్యాల‌కు ప్ర‌తిఫ‌ల‌మే స‌భ‌లో నేటి ప‌రిస్థితి అనేది మోడీ, షా ద్వయానికి తెలిసినా, ఒప్పుకోలేని స్థితిలో వారున్నారు. ఏపీ విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ‌లేదు కాబ‌ట్టే కేంద్రంపై అవిశ్వాసం వ‌చ్చింది. ప్ర‌తీరోజూ స‌భ‌లో హ‌డావుడి చేస్తున్న తెరాస ఎంపీలు కూడా రిజ‌ర్వేష‌న్ల విష‌య‌మై ప‌ట్టుబ‌డుతున్నారు. అన్నాడీఎంకే కూడా కావేరీ బోర్డుపై కేంద్రాన్ని నిల‌దీస్తోంది. ఓవ‌ర‌ల్ గా మోడీ స‌ర్కారు వైఖ‌రిని ఎండ‌గ‌ట్టాల‌ని కాంగ్రెస్ కూడా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. పార్ల‌మెంటులో ఆందోళ‌న‌లకు ఇలా ఎవ‌రి కార‌ణాలు వారికి ఉన్నాయి. కానీ, ఇవేవీ క‌నిపించ‌న‌ట్టు.. కేవ‌లం భాజ‌పా విజ‌యాల‌ను మాత్ర‌మే చూసి ఓర్వ‌లేకే అంద‌రూ ఇలా చేస్తున్నార‌ని మోడీ అన‌డం విడ్డూరం. అయినా, ఒక్క త్రిపుర‌ల‌తో త‌ప్ప… భాజ‌పాకి చెప్పుకోద‌గ్గ విజ‌యాలేవీ..? ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఫుల్పూర్‌, గోర‌ఖ్ పూర్ ఉప ఎన్నిక‌ల్లో ఘోర‌మైన ఓట‌మి, రాజ‌స్థాన్ లో ఓట‌మి, గుజ‌రాత్ లో త‌గ్గిన మెజారిటీ… ఇవ‌న్నీ ఏంటి..? స‌భ‌ను స‌జావుగా జ‌ర‌ప‌లేని వైఫ‌ల్యాన్ని, ప్ర‌తిప‌క్షాలు లేవ‌నెత్తే అంశాలపై స‌మాధానాలు చెప్ప‌లేనిత‌నాన్ని క‌ప్పి పుచ్చేలా మోడీ, అమిత్ షా మాట్లాడుతున్నారు. ఈ మూడు రోజులూ ఎంపీలు చేయ‌బోతున్న ప‌ని ఇదేనా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.