బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేసి పేరు తెచ్చుకున్న శోభిత ధూళిపాళ మన తెలుగమ్మాయే. 2016 నుంచి ఆమె సినిమాల్లో ఉన్నప్పటికీ.. ప్రధాన పాత్రలో తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ‘చీకటిలో’ సినిమాతో తెలుగు ఓటీటీలో అడుపెట్టింది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. డి. సురేష్ బాబు నిర్మాణంలో వుండటం మరో విశేషం. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎలా వుంది? చీకటిలో ఏం జరిగింది?
సంధ్య నెల్లూరి (శోభిత ధూళిపాళ) క్రిమినాలజిస్టు కావాలనుకుంటుంది. కాకపోతే ప్రొఫెసర్ తో అభిప్రాయ బేధాల కారణంగా పీ.హెచ్.డీ మధ్యలోనే ఆపేస్తుంది. ఓ న్యూస్ ఛానల్లో క్రైమ్ ప్రోగ్రాం ప్రజెంటర్ గా పని చేస్తుంటుంది. వార్తల్ని రాసే విధానం, ఒక క్రైమ్ ని టీఆర్పీ కోసం వాడుకునే తీరుతో విసిగిపోయి ఆ ఛానల్లో పని చేసే బాబీ (అతిధి) ఇచ్చిన ఐడియాతో సొంతంగా పాడ్ కాస్ట్ స్టార్ట్ చేయాలని అనుకుంటుంది. సరిగ్గా ఇదే సమయానికి బాబీ దారుణమైన హత్యకు గురి అవుతుంది. ఈ హత్య వెనుక ఓ సీరియల్ కిల్లర్ ఉన్నాడని గ్రహించిన సంధ్య.. ఆ కిల్లర్ ని పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది? కిల్లర్ మోటివ్ ఏమిటి? ఆ ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు? చివరికి చట్టానికి చిక్కాడా లేదా? అనేది మిగతా కథ.
సీరియల్ కిల్లర్ బ్యాక్డ్రాప్లో కథలన్నీ దాదాపు ఒకటే మూసలో వుంటాయి. ‘చీకటిలో’ కథని సీరియల్ కిల్లర్ జానర్ లో చూస్తే ఓ మామూలు కథే అనిపించవచ్చు. కాకపొతే ఇందులో ఒక సామాజిక రుగ్మతని టచ్ చేశారు. అత్యాచారాలకు ముగింపు పలకాలంటే ముందు అత్యాచారం జరిగిందని చెప్పే బలమైన గొంతుక కావాలి. బాధితులు ధైర్యంగా ముందడుగు వేయాలి. ఈ కోణంలో చూసినప్పుడు సీరియల్ కిల్లర్ క్రైమ్ సినిమాల్లో చీకటిలో ప్రత్యేకంగా కనిపిస్తుంది.
ఓ అర్ధరాత్రి గోదావరి ప్రాంతంలో జరిగిన ఓ ఘటనతో కథని మొదలుపెట్టడం, కథ హైదరాబాద్ కి మారిన తర్వాత జరిగిన బాబీ హత్య, ఆ వెంటనే వాచ్ మ్యాన్ ని అరెస్ట్ చేసి జైలుకి పంపడం.. చకచక జరిగిపోతాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలౌతుంది. అసలు క్రిమినల్ ముసుగులో తిరుగుతున్నాడని గ్రహించిన సంధ్య తన కోసం చేసే విచారణ ఆసక్తికరంగా వుంటుంది.
కాకపోతే సెకండ్ హాఫ్ నుంచి కథనం కాస్త నెమ్మదిస్తుంది. పోలీస్, క్రిమినల్ మధ్య మైండ్ గేమ్ ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు. క్రినిమల్ ని చేరుకోవడానికి జరిగే విచారణ అంత థ్రిల్లింగ్ గా వుండదు. సైకో కిల్లర్ కి కూడా ఒక బ్యాక్ స్టొరీ పెట్టారు. ఆ కథని అత్యాచారానికి ముడిపెట్టిన విధానం కొత్తగానే వుంటుంది. అయితే సైకో కిల్లర్ సినిమాల్ని విపరీతంగా చూసే ప్రేక్షకులకి మాత్రం కిల్లర్ కథలో బోలెడు లాజిక్కులు లాగుతారు. కాకపోతే ఇందులో చూపించిన సైకో కిల్లర్ ని డైరెక్టర్ రివిల్ చేసేవరకూ గెస్ చేయడం కష్టమే.
సంధ్య పాత్రలో శోభితా నటనకు మంచి మార్కులు పడతాయి. చాలా సెటిల్డ్ గా కనిపించింది. ఈ కథలో తనూ ఓ బాధితురాలు. ఆ బాధని తను క్యారీ చేసిన విధానం చాలా సహజంగా వుంటుంది. ఇలాంటి కథలు ఒక దశ దాటిని తర్వాత సందేశాత్మకంగా మారుతాయి. అయితే శోబిత తన నటనతో అలాంటి రొటీన్ మూసకి అవకాశం ఇవ్వలేదు. తన బాడీలాంగ్వేజ్ సహజంగా కుదిరింది. ఇక నుంచి ఇలాంటి పాత్రలు, కథలు శోభితను వెదుక్కొంటూ మరిన్ని వస్తాయేమో?
విశ్వదేవ్ రాచకొండ, ఈషా చావ్లా, ఆమని, సురేష్ పాత్రలని పరిధిమేరకు చేశారు. కాకపోతే ఇందులో కథలో కీలకమై రిజిస్టర్ కాని కొన్ని పాత్రలు వుంటాయి. అలాగే మిస్ లీడింగ్ చేయడానికి కూడా కొన్ని పాత్రలు వాడుకున్నారు. శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం బాగా కుదిరింది. చీకటిలో టైటిల్ కి తగ్గట్టు ఈ సినిమాని డార్క్ టోన్ లో సెట్ చేశారు. కలర్ గ్రేడింగ్, విజువల్స్ క్రైమ్ థ్రిల్లర్ కి కావాల్సిన డెప్త్ ఇచ్చాయి.
ఈ కథలో మరీ మైండ్ బెండింగ్ మలుపులు వుండవు కానీ అసలు హంతకుడు ఎవరా అనే ఆసక్తి చివరి వరకూ కొనసాగించిన చిత్రమిది. పైగా ఇలాంటి కిల్లింగ్ కథలో ఎక్కడా ఇబ్బంది కలిగించే విజువల్స్ లేకపోవడం మరో మంచి విషయం. ఒక కొత్త క్రైమ్ కథని చూడాలనుకునే ఓటీటీ ఆడియన్స్ కి చీకట్లో మంచి ఆప్షన్.
ఫినిషింగ్ టచ్: శోభిత షో..!
