నాగచైతన్యని పెళ్లి చేసుకొన్న తరవాత.. శోభిత దూళిపాళ గురించి ఎలాంటి వార్త బయటకు వచ్చినా అది సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అవుతోంది. ఆమె సినిమాలూ, వెబ్ సిరీస్‌లూ ఇప్పుడు కొత్తగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి తరవాత శోభిత నుంచి కొత్త ప్రాజెక్టులు ఏవీ బయటకు రాలేదు. ఇప్పుడు అమేజాన్ ప్రైమ్ కోసం ఓ సినిమా చేసింది. అదే ‘చీకట్లో’. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ఇదో క్రైమ్ సస్పెన్స్ డ్రామా. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అమేజాన్ ప్రైమ్ ఈనెల 23న విడుదల చేస్తోంది.
పాడ్ కాస్ట్ సెటప్, ఇన్వెస్టిగేషన్ మోడ్ లో శోభిత ఫస్ట్ లుక్‌ని ఈరోజు రివీల్ చేశారు. ఇది వరకు కూడా శోభిత కొన్ని వెబ్ సిరీస్‌లు చేసింది. అయితే అవన్నీ కాస్త రొమాంటిక్, బోల్డ్ జోన్లో సాగే పాత్రలు. ఈసారి మాత్రం అందుకు భిన్నమైన ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. శోభిత నుంచి వస్తున్న ఒరిజినల్ మూవీ కాబట్టి.. తప్పకుండా దీనిపై ఫోకస్ చేసే అవకాశం ఉంది. అమేజాన్ ప్రైమ్.. ఈ సినిమా కోసం స్పెషల్ గా పబ్లిసిటీ ప్లానింగ్ చేస్తోంది. అందుకోసం నాగచైతన్యని సైతం రంగంలోకి దింపాలని భావిస్తోంది. త్వరలో హైదరాబాద్ లో ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చైతూ కూడా ఇందులో భాగం పంచుకొనే అవకాశం ఉంది. అన్నట్టు ఈ చిత్రానికి డి.సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. అమేజాన్ కోసం సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఓ సినిమాని రూపొందించడం ఇదే ప్రధమం. ట్రైలర్ ఒకట్రెండు రోజుల్లో బయటకు రానుంది.
