ఐ బొమ్మ రవిని అరెస్టు చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పోలీసులనే సవాల్ చేస్తే వదిలేస్తామా అని సజ్జనార్ కూడా ప్రకటించారు. సినీ ప్రముఖుల్ని పిలిచి వారితో కలిసి ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఐ బొమ్మ రవికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్దగా ఎలాంటి కామెంట్స్ వినిపించడం లేదు. పైగా మద్దతుగా మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. మొదటి రోజు తక్కువగానే ఉన్నా.. ఇది రోజు రోజుకు పెరిగిపోతోంది.
ఐ బొమ్మ రవి నేపధ్యం కూడా చాలా మందిని ఆకర్షిస్తోంది. ఆయన ఇంటర్ చదివారు. వెబ్ డిజైనర్ బ్యాక్ గ్రౌండ్ మాత్రమే ఉంది. కానీ అన్ని సినిమాల ప్రింట్స్ ను ముందుగానే సేకరించి లీక్ చేసేంత హ్యాకింగ్ నైపుణ్యం సాధించాడు. ఎవరికీ దొరకుండా.. పైరసీ సైట్ నడుపుతున్నాడు. ఇంత టాలెంట్ ఎలా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. నటుడు శివాజీ కూడా.. అతడిని దేశ అవసరాలకు వాడుకోవాలని సలహా ఇచ్చాడు.
మరో వైపు చాలా మంది ఆయన తప్పేం చేయలేదని.. ఇండస్ట్రీ టిక్కెట్ రేట్లు, ధియేటర్ కు వెళ్లి సినిమా చూస్తే ఎలా ఖర్చయిపోతున్నామో చెబుతున్నారు. టిక్కెట్ రేట్ల పెంపుతో పెద్ద ఎత్తున దోచుకుంటున్నారని అంటున్నారు. ఆయనకు మద్దుతగా నిలిస్తున్నారు. ఇది పోలీసులు కూడా ఊహించని పరిణామం. సినిమాలు పైరసీ చేయడం వల్ల ఇరవై రెండు వేల కోట్ల నష్టం జరిగిందని పోలీసులు చెబుతారు కానీ.. సాంకేతికంగా నిరూపించడం సాధ్యం కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇండస్ట్రీకి పెను సమస్యగా మారిన ఐ బొమ్మ నిర్వాహకుడ్ని పట్టుకుని.. సైట్ క్లోజ్ చేసినా.. ఇండస్ట్రీకి కాకుండా నిందితుడికే మద్దతు రావడంపై.. ఇండస్ట్రీ కూడా ఆలోచించాల్సి ఉంటుందేమో ?