‘తెలుగు360’ ముందే చెప్పింది.. రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కన్నా లక్ష్మీ నారాయణకు తొలి సవాలు ఇంటిపోరే అని! అనుకున్నట్టుగా సొంత పార్టీ నేతల అసంతృప్త వాతావరణమే ఆయనకి స్వాగతం పలుకుతోంది. కన్నా లక్ష్మీనారాయణ నియామకంపై సోము వీర్రాజు వర్గం అసంతృప్తిగా ఉందని సమాచారం. వీర్రాజు కూడా ఈ నియామకం కొంత ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు, నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో సోము వీర్రాజు వర్గానికి చెందిన కొంతమంది నేతలు భాజపాకి రాజీనామాలు చేయడం గమనార్హం!
వీర్రాజుకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనందుకు నిరసనగానే రాజీనామాలు చేస్తున్నట్టు వారు ప్రకటించడం విశేషం. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య, రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడు బి. దత్తు.. ఈ రెండు కమిటీల్లోని కొంతమంది ప్రముఖ సభ్యులు రాజీనామాలు ప్రకటించారు. రాజీనామా లేఖల్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు, రామ్ మాధవ్ కి కూడా పంపినట్టు తెలిపారు. నిజానికి, రాష్ట్ర అధ్యక్ష పదవి సోము వీర్రాజుకు వస్తుందని ఆయనతోపాటు, ఆయన వర్గీయులు కూడా తీవ్రంగానే విశ్వసించారు. ఎందుకంటే, పార్టీకి మొదట్నుంచీ వీర్రాజు అండగా ఉంటూ వస్తున్నారు. ఇతర నేతలతో పోల్చితే టీడీపీపై ఘాటుగా విమర్శలు చేస్తూ, భాజపా వాణిని ఆయనే బలంగా వినిపిస్తున్నారు. దీంతో రాష్ట్ర విభజన తరువాత పార్టీలో చేరిన కన్నాని అధ్యక్షుడిగా నియమించడంపై ఆ వర్గం జీర్ణించుకోలేకపోతోంది.
అయితే, తన వర్గం రాజీనామాల ద్వారా తన అసంతృప్తిని కేంద్ర నాయకత్వానికి తెలియజేయాలన్నది వీర్రాజు వ్యూహమా అనే అనుమానం కలుగుతోంది. కన్నా నియామకం తరువాత వీర్రాజు అజ్ఞాతంలోకి వెళ్లారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వీర్రాజు అసంతృప్తికి గురయ్యారన్నది వాస్తవం. ఆయన్ని వీలైనంత త్వరగా బుజ్జగించే ప్రయత్నం తెర వెనక కచ్చితంగా జరుగుతాయి. వీర్రాజు వర్గం రాజీనామాలపై భాజపా కేంద్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కన్నా… ఈ తొలి సమస్యను ఎలా డీల్ చేస్తారో చూడాలి.