అనేక వివాదాలు, విమర్శల మధ్య హైదరాబాద్ రవీంద్ర భారతిలో అమర గాయకుడు ఎస్పి. బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమం పూర్తయ్యింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా బాలు విగ్రహావిష్కరణ జరిగింది. ఓ గాయకుడికి దొరికిన అపూర్వమైన గౌరవం ఇది. తెలుగువాళ్లంతా గర్వపడే క్షణాలివి. కొంతమంది ఆందోళన కారులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా, పోలీసుల ముందస్తు చర్యలతో ఎలాంటి ఆటంకం కలగలేదు. అయితే స్టార్లెవరూ ఈ వేదికపై కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున…. ఇలా ఏ హీరో పేరు చెప్పుకొన్నా, వాళ్లందరితోనూ బాలుకి ప్రత్యేకమైన అనుబంధం వుంది. దర్శక నిర్మాతలు అందరితోనూ చక్కటి స్నేహ బంధం వుంది. వాళ్లెవరూ ఈ కార్యక్రమంలో కనిపించలేదు. ఆర్పీ పట్నాయక్, కల్పన లాంటి ఒకరిద్దరు మినహా ఎవరూ రాలేదు. గాయనీ గాయకులకు, సంగీత దర్శకులకు, స్టార్ హీరోలకూ ఆహ్వానాలు అందాయా, లేదా? అనే అనుమానం కలుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మిస్ అయ్యారు. ఆయన ఢిల్లీలో ఉన్నారని, అందుకే రాలేకపోయారని సమాచారం. రేవంత్ ఉంటే.. ఇంకొంచెం కళగా ఉండేది. విగ్రహావిష్కరణ తరవాత బాలు పాడిన కొన్ని పాటల్ని వేదికపై గాయనీ గాయకులు ఆలపించారు. ఆ పాటలైనా కాస్త పాపులర్ సింగర్స్ పాడి ఉంటే బాగుండేది.
బాలు అంటే… వ్యక్తి కాదు. తెలుగు సంగీతం. ఆయన్ని గౌరవించుకొంటే మనల్ని మనం గౌరవించుకొన్నట్టే. ఇలాంటి అరుదైన వేదికలకైనా స్టార్లు కలిసి రావాల్సిన అవసరం వుంది. అదేం లేకుండానే బాలు విగ్రహావిష్కరణ జరిగిపోయింది. ఆహ్వానాలు అందినా, వివాదాలకు భయపడి కొంతమంది రాలేదన్న కామెంట్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి అందులో నిజమెంతో వాళ్లకే తెలియాలి.